logo

శిక్షణ ఇచ్చారు.. లక్ష్యం మరిచారు

పంట దిగుబడికి భూసారమే కీలకం. మే నెల పూర్తయినా రైతుల నుంచి మట్టి నమూనాల  సేకరణ ప్రారంభించలేదు. ఏప్రిల్‌ నెలలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ (వీఏఏ), ఉద్యాన (వీహెచ్‌ఏ) సహాయకులకు శిక్షణ సైతం ఇచ్చారు.

Updated : 03 Jun 2023 05:27 IST

ఖరారు కాని భూసార పరీక్షల ప్రణాళిక
ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే

మట్టి నమూనా సేకరిస్తున్న వీఏఏ

పంట దిగుబడికి భూసారమే కీలకం. మే నెల పూర్తయినా రైతుల నుంచి మట్టి నమూనాల  సేకరణ ప్రారంభించలేదు. ఏప్రిల్‌ నెలలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ (వీఏఏ), ఉద్యాన (వీహెచ్‌ఏ) సహాయకులకు శిక్షణ సైతం ఇచ్చారు. రోజులు గడుస్తున్నా మట్టి పరీక్షలకు సంబంధించిన లక్ష్యం ఖరారు కాలేదు. శిక్షణలో ప్రతి ఆర్బీకే పరిధిలో రెండు నమూనాలను సేకరించాలని నిర్దేశించారు.

ఏలూరు జిల్లాలోని 28, పశ్చిమ గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో వరి, ఉద్యాన పంటలు  సాగవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసార పరీక్షలను పక్కన పెట్టింది. 2020లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రం పరిధిలో 20 నమూనాలను సేకరించి అతి తక్కువ పరీక్షలు చేసి మమ అనిపించారు. అప్పటి నుంచి భూసార పరీక్షల ఊసే ఎత్తలేదు. భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం, బోరాన్‌ సమపాళ్లలో ఉంటే పంటలు బాగా పండుతాయి. ఈ ఏడాది భూసార పరీక్షలు చేయాలని ఏప్రిల్‌ నెలలో వీఏఏ, వీహెచ్‌ఏలకు మట్టి సేకరణపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ఆర్బీకే పరిధిలో రెండు చొప్పున మట్టి నమూనాలు సేకరించాలని నిర్దేశించారు. అకాల వర్షాలు, ధాన్యం సేకరణ హడావుడిలో కొన్ని చోట్ల దీని సంగతే వదిలేశారు.

ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం

వైఎస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ప్రయోగశాలలు పూర్తయిన చోట మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ ప్రయోగశాలల్లో మట్టిని పరీక్షించేందుకు అధికారులకు శిక్షణ ఇవ్వాలి. భవనాలు అందుబాటులోకి రాలేదు. ఏలూరు జిల్లాలో రెండేసి చొప్పున సేకరించిన మట్టి నమూనాలు గొల్లపూడిలోని అగ్రిల్యాబ్‌కు, పశ్చిమ గోదావరి జిల్లాలో సేకరించిన మట్టి నమూనాలను తాడేపల్లిగూడెం ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం మండలంలో 208 హెక్టార్లలో నారుమళ్లు వేశారు. ఉంగుటూరు మండలంలో రెండు, మూడు రోజుల్లో నారుమళ్లు పోసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కానీ ఇప్పటి వరకు రైతుల నుంచి ఎన్ని మట్టి నమూనాలు సేకరించాలో ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించడానికి సుమారు 20 రోజులు పడుతుంది. మరో పక్క ఖరీఫ్‌ సమయం దగ్గర పడింది. ఎప్పుడు సేకరించి.. ఎప్పుడు ఫలితాలు ఇస్తారో తెలియని పరిస్థితి. పంట సాగు తర్వాత ఈ ప్రక్రియ జరిగినా పెద్దగా ఉపయోగం ఉండదు. భూమిలోని పోషకాలు ముందుగా తెలిస్తే అందుకు తగ్గట్టుగా ఎరువులు అందించి వాటిని నివారించడం ద్వారా పంట దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి     వీలుంటుంది.

‘ఇప్పటి వరకు మొత్తం 842 మట్టి నమూనాలను సేకరించాం. వాటిని గొల్లపూడిలో ల్యాబ్‌కు పంపించాం. ఇంకా నమూనాలు సేకరించాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరితగతిన పూర్తి చేస్తాం.’ అని జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని