logo

తెదేపాతోనే రైతు రాజ్యం: నిమ్మల

జగన్‌ నాలుగేళ్ల పాలనలో రైతుకు వ్యయం తప్ప సాయం లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Published : 03 Jun 2023 04:02 IST

పెనుమదం వరి పొలాల్లో ప్రదర్శనగా వస్తున్న రామానాయుడు, రైతులు

పెనుమదం (పోడూరు), న్యూస్‌టుడే: జగన్‌ నాలుగేళ్ల పాలనలో రైతుకు వ్యయం తప్ప సాయం లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోడూరు మండలం పెనుమదంలో శుక్రవారం రైతులు, తెదేపా శ్రేణులతో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడమే రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందనడానికి ఉదాహరణ అన్నారు. రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పంట విరామం పలికే పరిస్థితి నెలకొందన్నారు. తెదేపాతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందన్నారు. మహానాడులో చంద్రబాబునాయుడు ప్రతి రైతుకు బాసటగా నిలిచేందుకు ఏటా రూ.20 వేలు అందిస్తామని ప్రకటించడంతో వందల మంది స్వేచ్ఛగా ఆ మహానేతకు ధాన్యాభిషేకం చేసేందుకు తరలివచ్చారన్నారు.  
200 మందికిపైగా రైతుల ప్రదర్శన.. పాలకొల్లు నియోజకవర్గం పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల నుంచి 200 మందికిపైగా రైతులు మండుటెండలో వరి పొలాల్లో ప్రదర్శనకు హాజరయ్యారు. తెదేపా (పసుపు), రైతు (పచ్చని), జాతీయ జెండాలతో వరి పొలాల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. తెదేపా మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు సాయానికి కృతజ్ఞతగా నినాదాలు చేశారు.  కార్యక్రమంలో తెదేపా పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షుడు పోతూరి రాంప్రసాద్‌చౌదరి, కార్యదర్శి రాచకొండ విశ్వనాథం, నాయకులు జి.సూర్యనారాయణరాజు, పెన్మెత్స రామభద్రరాజు, బోణం నాని తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని