logo

సీఎం సారూ.. మా కష్టం పట్టదా?

‘పూరిగుడిసెల్లో నివాసం ఉంటూ వరద ప్రభావంతో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తిరిగి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం.

Updated : 06 Jun 2023 05:21 IST

గతేడాది వరదల్లో గూడు కోల్పోయిన బాధితుల ఆవేదన

బాధితులతో మాట్లాడుతున్న జగన్‌ (పాతచిత్రం)

‘పూరిగుడిసెల్లో నివాసం ఉంటూ వరద ప్రభావంతో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తిరిగి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం. అధికారులు సర్వే చేసి బాధితులందరికీ తక్షణమే డబ్బులు ఇస్తారు.’ఇది వరద బాధితుల పరామర్శకు గతేడాది ఆగస్టు 27న సీఎం జగన్‌ వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ.

ఈనాడు, ఏలూరు, వేలేరుపాడు, కుక్కునూరు, న్యూస్‌టుడే

సాక్షాత్తు ముఖ్యమంత్రే భరోసా ఇస్తే తప్పక చేస్తారని బాధితులంతా ఆశపడినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సాయం ఇంకా వందల మందికి అందలేదు. ఇప్పటికీ ఆ బాధితులు నిలువ నీడ లేక గుట్టకొకరు పుట్టకొకరయ్యారు. మంగళవారం సీఎం పోలవరం వస్తున్న నేపథ్యంలో వరద బాధితులు సాయం కోసం ఆశగా ఎదురుచేస్తున్నారు.

పది నెలలుగా కుక్కునూరుకు చెందిన 250 కుటుంబాలు నివాసం ఉంటున్న తెల్లరాయిగూడెం పునరావాస కాలనీ

గతేడాది జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా వేలేరుపాడు, కుక్కునూరులో ప్రజలు సర్వం కోల్పోయారు. వరదల్లో 120 గ్రామాలకు పైగా మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి సామాన్లు కూడా పనికి రాకుండాపోయాయి. పూరిగుడిసెలు వరద నీటిలో నాని.. కొట్టుకుపోయాయి. దీంతో కట్టుబట్టలతో కొందరు పునరావాస కాలనీల్లో తలదాచుకుంటుంటే.. మరికొందరు గుడారాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. సీఎం వరద సాయం ప్రకటించి ఇప్పటికి 10 నెలలు గడిచినా వందల మందికి ఆర్థిక సాయం అందక అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి కావడంతో ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. చీకటి పడితే దోమల బెడదకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు.

పది నెలలుగా నిరీక్షణే మిగిలింది

ఇక్కడ ఇంటి అవశేషాల మధ్య నిలబడిన బాధితుడి పేరు సంగెపు పుల్లారావు. గత (2022 జులై) వరదల్లో ఆయన ఇల్లు వరదలో కొట్టుకుపోయింది.  పది నెలలుగా నిలువ నీడ లేక ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10 వేల ఇంటి నష్టపరిహారం లబ్ధిదారుల జాబితాలో పేరున్నా ఇప్పటి వరకూ నగదు రాలేదు. అప్పట్లో కూలిపోయిన ఇంటి అవశేషాలు అలాగే ఉండిపోయాయి. అది వస్తే ఇల్లు కట్టుకోవచ్చని కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. ఇల్లు లేక ప్రస్తుతం తెల్లరాయిగూడెంలోని పోలవరం పునరావాస కాలనీలో తలదాచుకుంటున్నారు.

1,626 మందికి ఇవ్వలేదు

రెండు మండలాల్లో 7,845 ఇళ్లకు నష్టం జరిగిందని అధికారులు సర్వే చేసి నిర్ధరించారు. అందులో గుడిసెలు 3404 ఉన్నాయి. వీరికి ఒక్కో ఇంటిని తిరిగి నిర్మించుకునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. ఇందులో 1778 మందికి పరిహారం ఇచ్చారు. ఇంకా 1626 మందికి అందలేదు. ఇవిగాక పక్కా, కచ్చా ఇళ్లు మరో 4,492 ఉన్నాయి. వీటికి సహాయం ప్రకటించినా ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు.


ఇతని పేరు ఖాదర్‌బాబా. కుక్కునూరుకు చెందిన ఈయన ఇల్లు గతేడాది వరదల్లో కూలిపోయింది. ప్రభుత్వ సాయం ప్రకటించినా ఇప్పటికీ అందలేదు. ఇల్లు కట్టుకునే డబ్బులు లేక తెల్లరాయిగూడెంలోని పునరావాసకాలనీలో ఉంటున్నారు. కుక్కునూరు ఏ బ్లాక్‌కు చెందిన దాదాపు 250 కుటుంబాలది ఇదే పరిస్థితి.


గుడారాల్లో తలదాచుకుంటున్నాం.. వరదలు వచ్చి పది నెలలవుతోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ప్రకటించిన సాయం ఇవ్వలేదు. దీంతో ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ గుడారంలో తలదాచుకుంటున్నాం. మళ్లీ వరదలు వచ్చే సమయం వస్తున్నా ఇంకా సాయం అందలేదు. అధికారులకు చెప్పినా ఫలితం లేదు. ఇప్పటికైనా సాయం చేస్తే ఇల్లు కట్టుకుంటా.

గుమ్మల మారయ్య దంపతులు, రేపాకగొమ్ము


కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు.. గతేడాది వరదలు ముంచెత్తడంతో బతుకుజీవుడా అంటూ పిల్లాపాపలతో 40 రోజులు కొండగట్టుపై ఉన్నాం. తీరా వరదలు తగ్గాక గ్రామానికి వచ్చి చూస్తే ఇల్లు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. ఇల్లు నిర్మించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక గుడారంలోనే బతుకుతున్నాం. చిమ్మ చీకటిలో దోమలు చంపుతున్నా అలాగే ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల నష్టపరిహారం కోసం స్థానిక అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

కొవ్వాల బక్కయ్య దంపతులు, రుద్రంకోట


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని