logo

ధాన్యం అమ్మాలంటే నరకమే..

సార్వా సాగుకు సన్నద్ధం కావాల్సిన రైతులు ఇంకా ధాన్యం అమ్ముకోవడానికి రైసు మిల్లుల చుట్టూ తిరుగుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఆచంట, పోడూరు మండలాల నుంచి పాలకొల్లు సమీపంలోని మిల్లులకు ధాన్యం వస్తూనే ఉంది.

Updated : 06 Jun 2023 05:22 IST

పూర్తిగా మిల్లులకు చేరాలంటే మరో 20 రోజులు

పూలపల్లి లేఅవుట్‌లో ధాన్యం లోడుతో నిలిపిన వాహనాలు

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: సార్వా సాగుకు సన్నద్ధం కావాల్సిన రైతులు ఇంకా ధాన్యం అమ్ముకోవడానికి రైసు మిల్లుల చుట్టూ తిరుగుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఆచంట, పోడూరు మండలాల నుంచి పాలకొల్లు సమీపంలోని మిల్లులకు ధాన్యం వస్తూనే ఉంది. ముఖ్యంగా పూలపల్లి రంగరాజు మిల్లుకు ఎక్కువగా వస్తోంది. వీటిని పక్కనే ఉన్న లేఅవుట్లో నిలుపుతున్నారు. మూడు నుంచి అయిదు రోజులపాటు ఎండలో వాహనాలు నిలిపి ఉంచడంతో టైర్లలో గాలి తగ్గడం, పంక్చర్లు అవుతున్నాయని చోదకులు వాపోతున్నారు. సమస్యను అధిగమించేందుకు కొంత మంది చోదకులు ట్రాక్టర్లు ట్రక్కులకు జాకీలు పెట్టి నిలుపుతున్నారు.

పంక్చర్‌ అయిన టైరు

జాకీతో ఎత్తిన ట్రాక్టర్‌

పాలకొల్లు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని ఆచంట మండలంలో 21,352 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు మిల్లులకు తోలారు. ఇంకా 4650 టన్నులు తోలాల్సి ఉంది. పోడూరు మండలంలో 39,017 టన్నులు తోలగా.. ఇంకా 1365 టన్నులు తోలాల్సి ఉంది. పాలకొల్లు మండలంలో 25,604 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తోలారు. ఇంకా 451 టన్నుల ధాన్యం తోలాల్సి ఉంది. ఆచంట మండలంలో 80, పాలకొల్లు, పోడూరు మండలాల్లో 98 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకులు అడ్డాల పార్వతి తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి రుతు పవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదృష్టం బాగుండి మరో నాలుగు రోజులు వెనక్కి వెళ్లడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే పూర్తిస్థాయిలో ధాన్యం మిల్లులకు చేరాలంటే మరో 20 రోజులు పట్టవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.


మిగిలేది నష్టమే.. మాది పోడూరు మండలం పోలవరం.మూడెకరాలు కౌలుకు సాగుచేశా. సార్వా నష్టపోయా. దాళ్వా పంట ఆశాజనకంగా ఉండటంతో అప్పులు తీరిపోతాయనుకున్నా. ధాన్యం మిల్లులకు వెళ్లినా ఇప్పటి వరకు దించుకోలేదు. దీనివల్ల ట్రాక్టర్‌ కిరాయి రూ.3 వేలు  ఉంటే డ్రైవర్‌కు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి. ఇది అదనపు భారం. రైతులకు మిగిలేది నష్టమే.

కె.రామకృష్ణ, పోలవరం


చెట్ల కింద నిరీక్షణ

మాది ఆచంట. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. పూలపల్లి రంగరాజు మిల్లుకు ధాన్యం లోడు తెచ్చి రెండు రోజులవుతోంది. వరుస క్రమంలో ధాన్యం దించాలంటే మరో రెండు రోజులు పట్టవచ్చు. అసలే ఎండలు మండిపోతున్నాయి. రాత్రి, పగలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. చెట్ల కింద కూర్చోవాల్సి వస్తోంది. మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలా మిల్లుల దగ్గర డ్రైవర్లకు భోజనాలు, మంచినీరు అందిస్తారు. ఇక్కడ అటువంటివేమీ లేవు.

ఎన్‌.రాము, ఆచంట  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని