logo

‘నిందితులను అరెస్టు చేయకపోతే స్టేషన్‌ ముట్టడి’

కలవల శ్రీనివాసరావు హత్యకేసుకు సంబంధించి రెండు రోజుల్లో సర్పంచి, మరో ఇద్దరిని అరెస్టు చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ ముట్టడిస్తామని తెదేపా నాయకులు నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌కు స్పష్టం చేశారు.

Published : 06 Jun 2023 04:28 IST

పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెదేపా నాయకులు

చాట్రాయి, న్యూస్‌టుడే: కలవల శ్రీనివాసరావు హత్యకేసుకు సంబంధించి రెండు రోజుల్లో సర్పంచి, మరో ఇద్దరిని అరెస్టు చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ ముట్టడిస్తామని తెదేపా నాయకులు నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌కు స్పష్టం చేశారు. మృతుడు శ్రీనివాసరావు భార్య పుష్పావతి తన కుమార్తెలు మౌనిక, మహేశ్వరి, తెదేపా నాయకులతో కలిసి సోమవారం చాట్రాయి స్టేషన్‌కు వచ్చారు. సర్పంచి ఇంటి ముందు తాము ధర్నా చేస్తుంటే గంటలో అదుపులోకి తీసుకుంటానని హామీ ఇచ్చి విస్మరించారని పుష్పావతి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసు విషయమై తెదేపా నాయకులు మరిడి వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివారావు, పుచ్చకాయల నోబుల్‌రెడ్డి డీఎస్పీతో మాట్లాడారు.


రిజర్వ్‌డ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

వెంకటనాగబాబు (పాతచిత్రం)

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లిలో రిజర్వ్‌డ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పెనుమల్లికి చెందిన రిజర్వ్‌డ్‌ కానిస్టేబుల్‌ పామర్తి వెంకటనాగబాబు(32) గుడివాడ పోలీసుస్టేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు నిమిత్తం ముదినేపల్లిలో కాపురం ఉంటున్నారు. పెనుమల్లిలో నిర్వహిస్తున్న సంబరానికి ఆదివారం భార్య, పిల్లలతో వెళ్లి, రాత్రి వారిని అక్కడే ఉంచి ముదినేపల్లికి వచ్చి ఇంటిలో పడుకున్నారు. సోమవారం భార్య ఫోన్‌ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ముదినేపల్లి వచ్చి, స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా నేలపై నాగబాబు మృతిచెంది ఉన్నారు. ఫ్యాన్‌కు చీర వేలాడుతుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య నాగజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.  


ఆత్మహత్య కేసులో  తొమ్మిది మంది అరెస్టు 

చాట్రాయి, న్యూస్‌టుడే: చాట్రాయి మండలం సోమవరం పంచాయతీ వార్డు మాజీ సభ్యురాలు కలవల పుష్పావతి భర్త శ్రీనివాసరావు ఆత్మహత్య కేసులో తొమ్మిది మంది నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు. పంచాయతీకి పిలిచి దాడి చేయడంతో పాటు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయడంతో మనస్తాపానికి గురై శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోగా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో రతికంటి సత్యనారాయణ, కుందేేటి నాగరాజు, కుందేేటి రామకృష్ణ, కుందేేటి శ్రీకాంత్‌, చెన్ను వెంకటేశ్వరరావు, చెన్ను చైతన్య, కొల్లి మహేశ్వరరావు, కుందేేటి భాస్కరరావు, కుందేేటి గాంధీలను అరెస్టు చేసి ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని