logo

ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతుండగా పలు ఖాళీలను బ్లాక్‌ చేశారు. విద్యా శాఖ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను ఒక రోజు ఆలస్యంగా సోమవారం విడుదల చేశారు.

Published : 06 Jun 2023 04:28 IST

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతుండగా పలు ఖాళీలను బ్లాక్‌ చేశారు. విద్యా శాఖ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను ఒక రోజు ఆలస్యంగా సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం గురువులు వెబ్‌ ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బదిలీ కోసం 5,840 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1,466 మంది ఉన్నారు. ఆయా పాఠశాలలకు సంబంధించి ఎస్‌ఏ తెలుగు 56, హిందీ 132 కొలువులను బ్లాక్‌ చేశారు. మిగిలిన కేటగిరీల్లో రెండు, మూడేసి చొప్పున బ్లాక్‌ చేశారు. తెలుగు, హిందీ సబ్జెక్టు బోధకుల ఖాళీలు ఎక్కువగానే ఉన్నా రిక్వెస్టు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు కొలువులను బ్లాక్‌ చేసినట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారిలో 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు, ఆ తర్వాత క్రమంలో 6 నుంచి 10 వరకు ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 8 వరకు ప్రీహైస్కూళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో తాము నష్టపోవాల్సి వస్తుందంటూ తప్పనిసరి బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. 1,466 ఖాళీలకంటే 30 శాతం అదనంగా ఖాళీలు చూపాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని