logo

పర్యాటక కేంద్రంగా పోలవరం: సీఎం

పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, దానికి సంబంధించిన కార్యాచరణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published : 07 Jun 2023 04:17 IST

సమీక్షలో మాట్లాడుతున్న జగన్‌

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, పోలవరం, కొయ్యలగూడెం, గ్రామీణ: పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, దానికి సంబంధించిన కార్యాచరణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో వంతెన నిర్మించాలని, పర్యాటకులు ఉండేందుకు వీలుగా సదుపాయాల కల్పన దిశగా కృషి చేయాలన్నారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి, వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు.

పర్యటన సాగిందిలా.. షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఉదయం 10.20 గంటలకు ప్రాజెక్టు దగ్గరకు చేరుకోవాల్సి ఉండగా 15 నిమిషాల ముందే వచ్చారు. 10.05కు హెలిప్యాడ్‌ దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. 10.15 వరకు వారితో స్థానిక అంశాలపై చర్చించారు. అనంతరం 11.30 వరకు ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు, డయాఫ్రం వాల్‌ను పరిశీలించారు. మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును అధికారులు వివరించారు. అనంతరం దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ను పరిశీలించి చేపడుతున్న మరమ్మతుల గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడి నుంచి 11.45 గంటలకు ప్రాజెక్టు ప్రాంతంలోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ఇంజినీర్లు, ప్రాజెక్టు అధికారులు, నాయకులతో పనుల ప్రగతిపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమీక్షించారు. నిధుల సమీకరణ, ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రధాన పనులు, ఇంకా చేయాల్సిన పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

మంత్రులు పినిపే విశ్వరూప్‌, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌, ఎమ్మెల్సీలు రవీంద్రనాథ్‌, జయమంగళ వెంకటరమణ, కవురు శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ఆళ్ల నాని, ఎలీజా, నాగేశ్వరరావు, ప్రతాప్‌ వెంకట అప్పారావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని