logo

బాస్కెట్‌బాల్‌ పోటీల్లో క్రీడాకారిణుల ప్రతిభ

చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే నమ్మకం వారిలో ఉత్సాహం నింపుతోంది.

Published : 07 Jun 2023 04:17 IST

ఏలూరు తూర్పువీధి, న్యూస్‌టుడే

చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే నమ్మకం వారిలో ఉత్సాహం నింపుతోంది. ఆటపై మక్కువ.. పతకాలు సాధించాలన్న తపన వారిని ముందుకు నడిపిస్తోంది. చదువులో మంచి మార్కులు సాధిస్తూనే నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండేసి గంటల చొప్పున ఏలూరు కస్తూర్బా నగర పాలక బాలికోన్నత పాఠశాల మైదానంలో శిక్షకుడు కె.మురళీకృష్ణ వద్ద తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలనేది తమ లక్ష్యమని చెబుతున్నారు.


క్రీడా కోటాలో కొలువు కోసం..

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. మూడేళ్లుగా బాస్కెట్బాల్‌లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురం హైస్కూలులో జరిగిన సబ్‌ జూనియర్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచా. ఈ ఏడాది ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించా. ఈ నెలలో పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్‌ పోటీల్లో మూడో స్థానం పొందా. క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించాలనేదే తన లక్ష్యమని దుంపల అమృత తెలిపారు.


జాతీయ స్థాయిలో రాణించాలని..

నేను పదో తరగతి పూర్తి చేశా. నాలుగేళ్లుగా బాస్కెట్బాల్‌లో శిక్షణ పొందుతున్నా. 2022 జూన్‌ 16 నుంచి 19 వరకు గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో శాప్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించా. అదే నెలలో విశాఖపట్నం గీతం వర్సిటీలో జరిగిన అండర్‌-17 విభాగంలో మూడో స్థానంలో నిలిచా. గత నెల 16 నుంచి 19 వరకు ప.గో.జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు మాంటిస్సోరి హైస్కూలులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్‌ బాలికల పోటీల్లో మూడో స్థానం పొందా. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలనేదే తన ఆశయమని పల్లపు జయశ్రీ తెలిపింది.


నిరంతర సాధనతో..

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఏడాదిన్నర నుంచి బాస్కెట్బాల్‌లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురంలో జరిగిన సబ్‌ జూనియర్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించా. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆరో స్థానంలో నిలిచా. ఈ ఏడాది నూజివీడులో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్‌-14 విభాగంలో మొదటి స్థానం పొందా. ఇటీవల పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన యూత్‌ బాస్కెట్బాల్‌ పోటీల్లో మూడో స్థానం సాధించా. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలనేదే తన ఆశయమని గనిరెడ్డి పూజిత తెలిపారు.


పోలీసు ఉద్యోగం సాధించాలని..

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. మూడేళ్లుగా బాస్కెట్బాల్‌లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురంలో జరిగిన సబ్‌ జూనియర్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచా. ఈ ఏడాది నూజివీడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించా. ఇటీవల పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్‌ పోటీల్లో మూడో స్థానంలో నిలిచా. క్రీడా కోటాలో పోలీసు ఉద్యోగం సాధించాలనేది తన లక్ష్యమని బాడిత దేవిశ్రీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని