logo

వదినతో సహజీవనం.. ఆపై హత్య

సహ జీవనం చేస్తున్న మహిళ మెడకు చీరచుట్టి హత్య చేసిన సంఘటన చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 07 Jun 2023 04:17 IST

మృతదేహాన్ని పరిశీలిస్తున్న కుటుంబ సభ్యులు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: సహ జీవనం చేస్తున్న మహిళ మెడకు చీరచుట్టి హత్య చేసిన సంఘటన చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మల్లేశ్వరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా ఆర్వీ90 గ్రామానికి చెందిన సుశాంత్‌ ముఖర్జీ తన సొంత అన్న భార్య అర్చనా ముఖర్జీతో(38) వివాహేతర సంబంధం పెట్టుకుని ఏడాది కిందట ఇక్కడకు వచ్చారు. సీతానగరం గ్రామంలో ఉన్న గోద్రేజ్‌ పామాయిల్‌ కర్మాగారంలో రోజువారీ కూలీగా చేరాడు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వదినతో సహజీవనం చేస్తున్నాడు. అర్చన ఇంటి వద్ద టైలరింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 3న మధ్యాహ్నం సమయంలో సుశాంత్‌ ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్తుండగా స్థానికులు ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. దీంతో తాను భద్రాచలం వెళుతున్నానని చెప్పారు. సాయంత్రం సుశాంత్‌ అద్దెకు ఉన్న ఇంట్లో లైట్లు వెలగక పోవడంతో ఎదురింట్లో ఉన్న మహిళ వెళ్లి చూడగా లోపల ఎవరూ కనిపించలేదు. పక్కనే మరుగుదొడ్డి తలుపు తీసి ఉండటం గమనించి వెళ్లి చూడగా అందులో అర్చన కిందపడి ఉండటం గమనించి చుట్టు పక్కల వారికి చెప్పారు. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న గుత్తేదారు మరికొంతమంది అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆమెలో కదిలికలు లేకపోవడంతో సహజీవనం చేస్తున్న సుశాంత్‌కు ఫోన్‌ చేశారు.  అర్చనా ముఖర్జీ అపస్మారకస్థితిలో ఉన్నారని, వెంటనే రావాలని చెప్పడంతో అతను వచ్చేస్తున్నానని చెప్పి కొంతసేపటి తర్వాత చరవాణి  స్విచ్‌ఆఫ్‌  చేశాడు.  అనుమానం వచ్చిన స్థానికులు 4వ తేదీ ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అర్చన మెడకు చీర చుట్టి హత్య చేసినట్లు గుర్తించి ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలించగా వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని, సొంత అన్న భార్యతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని అర్చన భర్త, ఆమె అన్నను మంగళవారం చింతలపూడికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు అంగీకరించకపోవడంతో పోస్టుమార్టం అనంతరం అర్చన మృత దేహానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు.  అర్చనాముఖర్జీకి భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా, నిందితుడు సుశాంత్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని