logo

వీఈసీ కళాశాలలో నిలిచిన ప్రవేశాలు

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా అధ్యాపకులు లేరు.. విద్యార్థులు చేరరు. జిల్లాలో ఎక్కడా లేని వింత పరిస్థితి వీరవాసరంలోని వీఈసీ కళాశాలలో నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల బదిలీ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది.

Published : 08 Jun 2023 05:44 IST

వీఈసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా బోర్డులో మార్చిన పేరు

వీరవాసరం, న్యూస్‌టుడే: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా అధ్యాపకులు లేరు.. విద్యార్థులు చేరరు. జిల్లాలో ఎక్కడా లేని వింత పరిస్థితి వీరవాసరంలోని వీఈసీ కళాశాలలో నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల బదిలీ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఈ కళాశాల పేరు కనిపించడంలేదు.  ఇక్కడ పనిచేసే సిబ్బంది, అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. కళాశాలలో చేరేందుకు వచ్చే విద్యార్థులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఎందుకిలా..

వీరవాసరంలో వీఈసీ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గతేడాది యాజమాన్యం అంగీకారం తెలిపింది. గత ఆగస్టులో దీనికి సంబంధించిన జీవో విడుదలైంది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఆర్జేడీ శారద గత సెప్టెంబర్‌లో కళాశాలను సందర్శించి ఆస్తులు, భవనాలు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. తరువాత వీఈసీ ప్రభుత్వ కళాశాల పేరిట బోర్డు కూడా ఏర్పాటు చేశారు. విలీన ప్రక్రియ పూర్తవుతుందనుకున్న తరుణంలో భవనం, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అడ్డంకులతో ముందడుగు పడలేదు. అధ్యాపకుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన జాబితాలో ఈ కళాశాల పేరు లేకపోవడంతో ఇక్కడికి రావాలనుకొనేవారికి అవకాశం లేకుండాపోయింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు వచ్చిన విద్యార్థులు ఇక్కడి పరిస్థితులు తెలుసుకుని వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ముగ్గురు అధ్యాపకులు, ముగ్గురు సిబ్బంది, మరో పది మంది వరకు ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. ఒప్పంద సిబ్బందికి ఏడాది నుంచి వేతనాలు లేవు. ప్రవేశాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న వీఈసీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కమిషనర్‌కు లేఖరాశాం..

వీఈసీ జూనియర్‌ కళాశాల పేరు మార్పు అంశం కారణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీనిపై కమిషనర్‌కు లేఖ రాశాం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

 ఐ.శారద, ఆర్జేడీ, రాజమహేంద్రవరం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని