logo

నీళ్లొచ్చేసినా మందగమనమే!

పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు. రెండు మూడు రోజుల్లో శివారు ప్రాంతాలకు జలాలు చేరే అవకాశం ఉంది. కానీ మంజూరైన కొద్దిపాటి ఓఅండ్‌ఎం పనులూ వేగం పుంజుకోలేదు. వరద నివారణ చర్యలు, సామగ్రిని భద్రపరిచే పనుల కోసం పిలిచిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది.

Updated : 08 Jun 2023 06:42 IST

ఊపందుకోని తూడు తొలగింపు
వరద నివారణ సామగ్రికి పడని టెండర్లు

యండగండి ప్రాంతంలో ఉండి ప్రధాన పంట కాలువలో పేరుకున్న గుర్రపుడెక్క

భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు. రెండు మూడు రోజుల్లో శివారు ప్రాంతాలకు జలాలు చేరే అవకాశం ఉంది. కానీ మంజూరైన కొద్దిపాటి ఓఅండ్‌ఎం పనులూ వేగం పుంజుకోలేదు. వరద నివారణ చర్యలు, సామగ్రిని భద్రపరిచే పనుల కోసం పిలిచిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. దీంతో మూడోసారి టెండర్లు ఆహ్వానించారు.
ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)లో భాగంగా డెల్టాలో రూ.8.45 కోట్ల అంచనా వ్యయంతో 78 పనులకు ప్రభుత్వం మే నెలాఖరులో ఆమోదం తెలిపింది. వీటిలో తొలి దశలో రూ.7.30 కోట్ల విలువైన 73 పనులకు టెండర్లు పిలవగా 65 ఖరారయ్యాయి. మిలిగిన వాటికి రెండో దశలో గుత్తేదారులను ఆహ్వానించగా రెండు పనులకు మాత్రమే స్పందన వచ్చింది. వరద సామగ్రిని భద్రపరిచే పనులకు టెండర్లు పడకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ వెంబడి దువ్వ, మీనవల్లూరు, పిప్పర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఈ పనుల కోసం మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. తొలి విడతలో గుత్తేదారులు ముందుకొచ్చిన వాటిలో తూడు తొలగింపు పనులు 60 వరకూ ఉన్నాయి. కొన్నిచోట్ల తూడు తొలగింపు ఇప్పటికీ ఊపందుకోలేదు.

నీటి విడుదల ఇలా..

డెల్టాలో ప్రధాన పంట కాలువలకు సాగునీటి విడుదలను బుధవారం మరికాస్త పెంచారు. ఈనెల 5న విజ్జేశ్వరంలో కాటన్‌ బ్యారేజీ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీరొదిలారు. ఆరో తేదీన మూడు వేల క్యూసెక్కులిచ్చారు. బుధవారం ఉదయం నుంచి 4 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ జలాలు దువ్వ రెగ్యులేటర్‌ వద్దకు సాయంత్రానికి చేరాయి. మరో 48 గంటల్లో శివారు ప్రాంతాలకు చేరొచ్చని భావిస్తున్నారు.

చెరువులు వెలవెల..

ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, గణపవరం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆచంట, పోడూరు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లోని చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. సుమారు 20- 25 చెరువుల్లో రెండు, మూడు అడుగుల లోపే   ఉన్నాయి. కాలువలన్నీ ప్లాస్టిక్‌, థర్మాకోల్‌ వ్యర్థాలతో పాటు ఆక్వా చెరువుల మురుగు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కాలుష్య జలాలు దిగువకు వెళ్లాక గానీ పల్లెల్లో తాగునీటి చెరువులు నింపే అవకాశం లేదు. కాలువలకు మరో వెయ్యి క్యూసెక్కులకు మించి నీరిస్తే తప్ప వ్యర్థాలన్నీ దిగువకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.

వేగవంతమయ్యేలా చర్యలు

టెండర్లు పడినచోట్ల తూడు తొలగింపు పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకున్నాం. కాలువల్లో వ్యర్థాలన్నీ దిగువకు కొట్టుకుపోయేలా నీరొదులుతున్నాం. బుధవారం 4 వేల క్యూసెక్కులనీరిచ్చాం. వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిన వెంటనే చెరువులను నింపుకోవాలని సూచిస్తున్నాం. 

 దక్షిణామూర్తి, జలవనరుల శాఖ ఈఈ, శెట్టిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని