logo

ఆశ చూపి.. అడ్డంగా దోచేసి

జిల్లా కేంద్రం ఏలూరులో భారీ సైబర్‌ మోసం జరిగింది. రెట్టింపు డబ్బు ఆశ చూపి ‘వైన్‌’ అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.లక్షల్లో డబ్బులు సేకరించి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.

Published : 08 Jun 2023 05:44 IST

‘వైన్‌’ యాప్‌ పేరుతో ఏలూరులో భారీ మోసం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం ఏలూరులో భారీ సైబర్‌ మోసం జరిగింది. రెట్టింపు డబ్బు ఆశ చూపి ‘వైన్‌’ అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.లక్షల్లో డబ్బులు సేకరించి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఫిబ్రవరి నుంచి నగరంలో ఈ యాప్‌ కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండురోజులుగా యాప్‌ పనిచేయకపోవడంతో డబ్బులు జమచేసిన వారంతా లబోదిబోమంటున్నారు. జిల్లా, నగర వ్యాప్తంగా సుమారు 200 నుంచి 300 వరకు బాధితులుంటారని, వీరంతా కలిపి సుమారు నాలుగైదు కోట్ల రూపాయల వరకు మోసపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు బుధవారం ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు సైబర్‌ క్రైం విభాగానికి బదిలీ చేస్తామని, పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

‘వల’ వేశారిలా.. తొలుత ఈ వైన్‌ యాప్‌లో రూ.5,500 డిపాజిట్‌ చేసిన వారికి 45 రోజుల పాటు రోజుకు రూ.302 చొప్పున రూ.13,590, రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.1,700 చొప్పున 30 రోజులకు రూ.51,000, రూ.95 వేలు కడితే రోజుకు రూ.12 వేలు చొప్పున 30 రోజుల పాటు రూ.3,60,000 ఆన్‌లైన్‌ ద్వారా ఖాతాల్లో వేసేవారు. దీంతో చాలా మంది సొమ్ముకు ఆశపడి రూ.2 లక్షలు, రూ.4 లక్షలు, రూ.6 లక్షలు ఇలా డిపాజిట్‌ చేశారు. నగరంలోని ఓ కారు ట్రావెల్స్‌కి సంబంధించిన డ్రైవర్లు చాలా మంది బాధితులుగా ఉన్నారు. కొంతమంది సొంత కార్లు తాకట్టు పెట్టి డబ్బులు డిపాజిట్‌ చేశారని తెలుస్తోంది. వారంతా సుమారు రూ.40 లక్షల మేర పోగొట్టుకున్నట్లు సమాచారం. మోసపోయిన వారిలో పలు ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు కూడా ఉన్నారు. గత నెల 30న ఈ గ్రూపులో స్పెషల్‌ ఆఫర్‌ పెట్టామంటూ వల వేశారు. ఆ ఒక్కరోజే రూ.కోటి వరకు యాప్‌కు జమైనట్లు తెలిసింది. అనంతరం నాలుగైదు రోజులకు యాప్‌ కార్యకలాపాలు నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు