logo

చెరువు తవ్వకాలు మళ్లీ ప్రారంభం

ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. కొంత కాలంపాటు ప్రభుత్వం అనుమతులు నిలుపుదల చేయడంతో ఈ ఏడాది అధికారిక తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఈ నెల నుంచి జిల్లా కమిటీ మళ్లీ అనుమతులు ఇస్తుండటంతో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కోమర్రు, దేవరం గ్రామాల్లో ప్రారంభించారు.

Published : 08 Jun 2023 05:44 IST

కోమర్రులో సాగుతున్న తవ్వకం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. కొంత కాలంపాటు ప్రభుత్వం అనుమతులు నిలుపుదల చేయడంతో ఈ ఏడాది అధికారిక తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఈ నెల నుంచి జిల్లా కమిటీ మళ్లీ అనుమతులు ఇస్తుండటంతో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కోమర్రు, దేవరం గ్రామాల్లో ప్రారంభించారు. కనీసం పెగ్‌ మార్కింగ్‌ ఇవ్వకుండా, సీఫేజ్‌ ఛానల్‌కు స్థలం వదలకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారుల వరకు, పంట, మురుగు కాలువలు పూడ్చి గట్లు వేస్తున్నారు. తాజాగా దేవరంలో సుమారు 15 ఎకరాల్లో చెరువు తవ్వకానికి యత్నించగా గ్రామస్థులు  అడ్డుకుని పొక్లెయిన్లు వెనక్కి పంపించేశారు. అదే గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో చెరువు తవ్వేందుకు పొక్లెయిన్లు తీసుకురాగా.. సరిహద్దు గ్రామమైన గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామస్థులు తమ నివాసాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు తవ్వకానికి అనుమతులు ఇవ్వొద్దని గతంలో అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్‌ఐ శివకుమార్‌ను సంప్రదించగా  అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలను అడ్డుకుంటామన్నారు.  మార్కింగ్‌ ప్రకారం తవ్వుతున్నారా లేదా అనేది పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా చెరువు తవ్వకాలకు అభ్యంతరాలుంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని