ప్రజారోగ్యంపై విషం
పరిశ్రమల కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యంతో పాటు భూ గర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండే తణుకు ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
చిమ్నీ ద్వారా వెలువడుతున్న పొగ
తణుకు, న్యూస్‌టుడే: పరిశ్రమల కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యంతో పాటు భూ గర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండే తణుకు ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఉదాసీనతతో..యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలువల్లోకి పరిశ్రమల వ్యర్థాలు వదులుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రధాన పంట కాలువలైన నరసాపురం, యనమదుర్రు, గోస్తనీ కాలువలు కాలుష్య కాసారాలుగా మారాయి. తణుకు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలను నేరుగా కాలువల్లోకి వదులుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను శుద్ధి చేయాల్సి ఉండగా ఎక్కడా ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. పరిశ్రమల్లో వ్యర్థాలను శుద్ధి చేసేందుకు(ఈటీపీ) ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నామ మాత్రంగా ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ నేరుగా వ్యర్థాలను కాలువల్లోకి వదులుతున్నారు. జిల్లాలో ప్రధానంగా తణుకు ప్రాంతంలో పెరవలి, అత్తిలి మండలం తిరుపతిపురం, తణుకు మండలం దువ్వ ప్రాంతాల్లో రొయ్యల శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలు వెలువడుతుంటాయి.
శుద్ధి చేయకుండానే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 భారీ, నాలుగు వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా రొయ్యల శుద్ధి కర్మాగారాలు, కెమికల్స్, అట్టల తయారీ, స్పిన్నింగ్, ఆయిల్ తయారీ, పేపర్, సిరామిక్, సీ ఫుడ్స్, కొబ్బరి, రొయ్యల ఫీడ్ తయారీ, ధాన్యం మిల్లులు వంటి పరిశ్రమలు ఉన్నాయి. సాధారణంగా వ్యర్థాలను శుద్ధి చేసి అనంతరం వచ్చిన నీటిని ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తుంటారు. దీని కోసం ప్రతి కర్మాగారంలో ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని పరిశ్రమలకు అవి అలంకారప్రాయంగా మారాయి. వీటిపై కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుంది. దీంతో కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలను సైతం పంట కాలువలోకి మళ్లిస్తున్నారు. ఈ కాలుష్యంతో కాలువల్లో చేపలు, జలరాశులు మృత్యువాత పడుతున్నాయి. మరో వైపు కర్మాగారాల్లోని బాయిలర్ల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో పలువురు రోగాల బారిన పడుతున్నారు. పొగ వెలువడే చిమ్నీలకు చిక్కాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా రొయ్యల శుద్ది కర్మాగారాలు విస్తరిస్తున్నాయి. తణుకు పరిసర ప్రాంతాల్లోనే పదుల సంఖ్యలో ఇవి ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది. వీటి ఏర్పాటుకు ఆయా కర్మాగారాల పరిధిలో హేచరీలు ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా రొయ్యలను శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతులు చేయాలి. దీనిపై ఎక్స్‌పోర్టింగ్ ఏజెన్సీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక్కోసారి విదేశాలకు వెళ్లిన కంటైనర్లు తిరిగి వస్తున్నాయి. ఇటీవల అత్తిలి మండలం తిరుపతిపురంలో ఓ సంస్థకు చెందిన కంటైనర్‌ను వెనక్కి పంపించారు.‘సీ ఫుడ్ పరిశ్రమలకు తప్పనిసరిగా ఈటీపీ ప్లాంట్లు ఉండాలి. వాటిని ఉపయోగించకపోతే చర్యలు తప్పవు. కొన్ని కర్మాగారాలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాం’ అని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు అన్నారు.
ఓ పరిశ్రమ నుంచి శుద్ధి చేయకుండా పంట బోదెలోకి వదులుతున్నవ్యర్థాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.