logo

విత్తనాలకేదీ భరోసా!

 అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి రాయితీపై విక్రయిస్తామని, దళారుల మోసాలకు కళ్లెం వేస్తామని అధికారులు చెబుతున్నారు.

Published : 10 Jun 2023 03:36 IST

పంపిణీపై రాని స్పష్టత

దుక్కి దున్ని సాగుకు సన్నద్ధం చేసిన భూమి

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:  అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి రాయితీపై విక్రయిస్తామని, దళారుల మోసాలకు కళ్లెం వేస్తామని అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాల్లో చాలాచోట్ల విత్తన నిల్వలు లేవు. రాయితీపై విత్తనాల కొనుగోలుకు ఆశగా ఆర్‌బీకేలకు వెళ్తున్న రైతులకు అవి అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.

కొద్ది రోజుల్లో ఖరీఫ్‌ ఆరంభం కానుంది. రైతులు పొలాలను దున్ని వరి సాగుకు సన్నద్ధం చేసుకున్నా ప్రభుత్వం విత్తనాల సరఫరా విషయమై నిర్ణయం తీసుకోకపోవడంతో నేటికీ అందని పరిస్థితి. ఏలూరు జిల్లాలో  ఈ ఏడాది 2.67 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అన్నదాతలు సన్నద్ధమయ్యారు. అయితే ఇప్పటికీ ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారు కాలేదు. వరి విత్తనాల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో గోదాములు, నిల్వ కేంద్రాలకు తరలించి మండల వ్యవసాయ కార్యాలయాలకు పంపించేవారు. ప్రస్తుతం నేరుగా ఆర్‌బీకేలకే సరఫరా చేస్తున్నారు.  మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద నారుమళ్లు పోస్తున్నారు. సమయానికి విత్తనాలు రైతులకు అందజేయకపోతే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఆన్‌లైన్‌లో నమోదుకు ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన కియోస్క్‌ యంత్రాలు సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిగణనలోకి తీసుకుని రైతుల అవసరం మేరకు ఆర్‌బీకేల్లో నిల్వ చేయాలి. చాలా చోట్ల నిల్వలు కానరావడం లేదు. ప్రతి నెలా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  చర్యలు తీసుకోవాలని సభ్యులు విన్నవిస్తున్నా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు.

నిరాశగా వెనుదిరిగి.. ఎకరాకు 30 కిలోల చొప్పున జిల్లా రైతులకు 80,265 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. వ్యవసాయాధికారులు 3,163 క్వింటాళ్లకు ఇండెంట్ పెట్టినా ఏలూరులోని ఏపీ సీడ్స్‌ కార్యాలయానికి నేటికీ చేరుకోలేదు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల కోసం రైతులు ఆర్‌బీకేలకు వెళ్లి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా రైతు నుంచి రైతు విత్తనాలు తీసుకునే విధానం ఎక్కువగా ఉంటుందని ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. మిగిలిన రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ ద్వారా పంపిణీకి 3,500 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ శారద తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని