logo

నిధులకు నోళ్లు తెరిచిన పనులు

పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో చేపట్టిన విలేజ్‌ క్లినిక్‌ భవనాలు కొన్నిచోట్ల పునాదుల స్థాయిలోనే ఉన్నాయి.

Updated : 10 Jun 2023 04:38 IST

పూర్తి కాని విలేజ్‌క్లినిక్‌ నిర్మాణాలు

భీమవరం పట్టణం, ఆకివీడు, పాలకొల్లు గ్రామీణ, మొగల్తూరు, పోడూరు, న్యూస్‌టుడే: పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో చేపట్టిన విలేజ్‌ క్లినిక్‌ భవనాలు కొన్నిచోట్ల పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల నిధులు అందినంత వరకు పనులు పూర్తిచేశారు. పలు ప్రాంతాల్లో రోగులకు వైద్య సేవలు ఎలా ఉన్నా వైద్య, సిబ్బందికే సౌకర్యాలు లేవు. రైతుభరోసా కేంద్రాలు, పాత భవనాల్లోనే సేవలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె భారాన్ని వైద్య సిబ్బంది భరిస్తున్నారు.

బిల్లుల విడుదలలో జాప్యం.. ఒక్కో భవన నిర్మాణానికి రూ.17.5 లక్షలు తొలుత ప్రకటించారు. వీటిలో 50 శాతం ఉపాధి హామీ, మరో 50 శాతం వైద్య ఆరోగ్యశాఖ నుంచి విడుదల కావాలి. కొన్ని నెలలుగా బిల్లులు విడుదల జాప్యంతో పనులు ముందుకు సాగడంలేదు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సిమెంటు, రంగులు, విద్యుత్తు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించలేదు.

పోడూరులో గత కొన్నినెలలుగా ఎలాంటి పనులూ చేయడంలేదు. ఇక్కడ సేవలు అందుబాటులోకి వస్తే దాదాపు 5వేలు మందికి ఉపయోగకరమని స్థానికులు అంటున్నారు.

చిరునామా తెలియని ప్రాంతాల్లో సేవలు

పలు ప్రాంతాల్లోని వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు చిరునామా తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. రైతు భరోసా, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతరత్రా కార్యాలయాల్లో హెల్త్‌క్లినిక్‌ల సిబ్బంది సర్దుకుపోతున్నారు. వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌ల్లో గర్భిణులు, చిన్నారులతోపాటు చిన్నపాటి రుగ్మతలతో వచ్చేవారికి సేవలు అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వైద్య సేవల బాధ్యత వీరిదే. వైద్యశాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య సర్వేల నివేదికలు ఇక్కడే నమోదు చేయాలి. గ్రామ జనాభాను బట్టి నిత్యం 25 నుంచి 30 మంది సద్వినియోగం చేసుకుంటారు.సేవలందించేందుకు ఎం.ఎల్‌.హెచ్‌.పి, సీహెచ్‌వో, ఎ.ఎన్‌.ఎం, ఆశ వర్కర్లు ఉండాలి.

వేగవంతం చేయిస్తాం :

సెప్టెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని పంచాయతీరాజ్‌ ఈఈ కె.ఎస్‌.ఎస్‌ శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం అదనంగా రూ.3.30 లక్షలు చొప్పున మంజూరయ్యాయన్నారు. వీటితో ఆయా భవనాలకు మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. పునాదుల్లో ఉన్నవాటిని కూడా వెంటనే పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానన్నారు.


* ఆకివీడు మండలం గుమ్ములూరులో చేపట్టిన వైఎస్సార్‌ విలేజ్‌క్లినిక్‌ భవనం నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఇక్కడ సేవలు అందుబాటులోకి వస్తే తెరటావ, గుమ్ములూరు, అప్పారావుపేట తదితర ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. నిర్మాణం పూర్తికాకపోవడంతో కిలో మీటరు దూరంలోని పాత పంచాయతీ భవనంలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.


* పాలకొల్లు గ్రామీణ మండలంలో 11 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించలేదు. శివదేవుని చిక్కాలలో మాత్రమే భవనం కొద్దిరూపం దాల్చుకుంది. విలేజ్‌క్లినిక్‌ భవనాలు నిర్మాణం కాకపోవడంతో సమీపంలోని సచివాలయాల్లో సేవలు కొనసాగిస్తున్నారు.


* శేరేపాలెంలో నిర్మాణదశలో నిలిచిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ భవనం ఇది. మొగల్తూరు మండలంలో 20 వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లకు ప్రతిపాదనలు చేశారు. ముత్యాలపల్లిలో స్థలవివాదం కోర్టులో పరిధిలో ఉంది. శేరేపాలెం, కాళీపట్నంపడమర, మొగల్తూరు, రామన్నపాలెంలలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. శేరేపాలెంలో పాతపంచాయతీ భవనంలో హెల్త్‌క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. కుటుంబ వైద్యుడు సేవల్లో భాగంగా 104 వాహనం వచ్చినప్పుడే ఇక్కడ వైద్యసేవలు అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని