logo

శివార్లకు జలాలు.. అవరోధంగా వ్యర్థాలు

డెల్టాలో ప్రధాన కాలువల శివారు ప్రాంతాలకు కొత్త జలాలు చేరాయి. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్‌ డివిజన్ల పరిధిలోని పల్లెపల్లెకు చేరుతున్న గోదారమ్మకు పసుపు, కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టి  పూజలు చేస్తున్నారు.

Published : 10 Jun 2023 03:36 IST

చెరువుగట్టుపాలెం కాలిబాట వంతెన దిగువున కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా వ్యర్థాలు

ఉండి, న్యూస్‌టుడే: డెల్టాలో ప్రధాన కాలువల శివారు ప్రాంతాలకు కొత్త జలాలు చేరాయి. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్‌ డివిజన్ల పరిధిలోని పల్లెపల్లెకు చేరుతున్న గోదారమ్మకు పసుపు, కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టి  పూజలు చేస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు తీర్చాలని వేడుకుంటున్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి పెంచి విడుదల చేస్తున్న 4 వేల క్యూసెక్కుల నీటినే ప్రధాన పంట కాలువలకు పంచుతున్నారు.

ఓఅండ్‌ఎం నిధులతో గుత్తేదారుల నుంచి స్పందన లభించిన 67 పనులు అత్యధిక చోట్ల ప్రారంభమయ్యాయి. వీటిలో తూడు నిర్మూలన కోసం కాలువల్లోకి నీరొదలక ముందు వివిధ చోట్ల రసాయనాలు పిచికారీ చేశారు. ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాలు, థర్మకోల్‌ సీట్లు, గృహాలు, దుకాణాల్లోని చెత్తా చెదారంతో పాటు పలురకాల వ్యర్థాలు పంట కాలువలు కాలుష్య కారకాలుగా మారిపోయాయి. వాటిలో పేరుకుపోయిన అన్నిరకాల మలినాలు బయటకు పోవాలంటే తొలుత ప్రధాన కాలువ అంచుల వరకూ నీటిమట్టాన్ని పెంచడమే ప్రధాన కర్తవ్యంగా తలిచారు. దీంతో ప్రధాన కాలువల వెంబడి ఉన్న సర్‌ప్లస్‌ వియర్లు, టైల్‌డ్యామ్‌లను ఎక్కడికక్కడ మూసేసి నీటి మట్టాన్ని పెంచుతున్నారు. ఉండి ప్రధాన పంట కాలువపై చెరుకువాడ టైల్‌డ్యామ్‌తో పాటు యండగండి, ఉండి సర్‌ఫ్లస్‌ వియర్లను గత రెండ్రోజుల నుంచి మూసివేశారు. దీంతో ఉండి అక్విడక్టు వద్ద 4.3 అడుగులకు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి చేరింది. ఆ నీటిలో అక్కడక్కడా ఆక్వా కాలుష్యాన్ని వదిలేస్తున్నారు. యనమదుర్రు, బొండాడ, రుద్రాయకోడు డ్రెయిన్లల్లోని సర్‌ఫ్లస్‌ వియర్లను తెరిచిన ఉండి ప్రధాన పంట కాలువలోని కలుషిత నీటిని రెండ్రోజుల్లో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాలన్నీ కొట్టుకుపోతేనే ప్రధాన కాలువల్లోకి తాజా నీరొచ్చే అవకాశాలున్నాయి.

ఆ తర్వాతే  ప్రక్షాళన పనులు

డెల్టాలో 368 కిలోమీటర్ల పరిధిలో 11 ప్రధాన కాలువలు ప్రవహిస్తున్నాయి. వాటితో పాటు ఉప కాలువలు 1,166 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ప్రధాన కాలువల్లో వ్యర్థాలను బయటకు పంపిన తర్వాత ఉప కాలువల ప్రక్షాళనకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ ఇంజినీర్లు వివరిస్తున్నారు. వంతెనలు, కల్వర్టులున్న ప్రాంతాల్లో తూడు, గుర్రపు డెక్క, ఇతర చెత్తా చెదారాలు అవరోధాలవుతున్నాయి. కలుషిత నీరంతా బయటకు వెళ్తే తప్ప తాగునీటి చెరువుల్లో నింపుకునే అవకాశాలు లేవు. 50 శాతం చెరువుల్లో ఇప్పటికే తాగునీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జలవనరుల శాఖ శెట్టిపేట కార్యనిర్వాహక ఇంజినీరు దక్షిణామూర్తి తెలిపారు. కాలువల్లో స్వచ్ఛమైన నీరొచ్చిన వెంటనే పల్లె, పట్టణాల్లోని చెరువులు నింపుకోవాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని