logo

ఓటమి భయంతో జగన్‌ వెన్నులో వణుకు

ముఖ్యమంత్రి జగన్‌కు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని అఖిలపక్ష రాజకీయ నేతలు అన్నారు.

Updated : 18 Sep 2023 05:39 IST

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిల పక్ష నాయకులు

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు డేగా ప్రభాకర్‌

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌కు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని అఖిలపక్ష రాజకీయ నేతలు అన్నారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ విచారణ లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో అన్ని పక్షాలు ఏకోన్ముఖంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ సంపద సృష్టించడం చేతగాని ముఖ్యమంత్రి జగన్‌ అని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు లేవని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రోద్బలంతోనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లేపల్లి రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. భారత్‌ బచావో ఏలూరు జిల్లా అధ్యక్షుడు గుబ్బల నాగేశ్వరరావు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబును అమర్యాదకరంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఆప్‌ నాయకుడు షేక్‌ మస్తాన్‌ బాషా, వ్యకాస జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ తదితరులు మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని