ముగిసిన జాతీయ స్థాయి నాటికోత్సవాలు
గుర్తుతెలియని శవం నాటికలో ఓ సన్నివేశం
పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: పాలకొల్లు కళా పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 12వ జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. స్థానిక అద్దేపల్లి వారి సత్రం ప్రాంగణంలో కలిదిండి రఘురామరాజు కళా వేదికపై మొత్తం ఏడు నాటికలు ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలుగా జి.కృష్ణమూర్తి, జి.వరప్రసాద్, జి.చిన్నారావు వ్యవహరించారు. నాటకోత్సవాలు విజయవంతానికి సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, ప్రధాన సలహాదారుడు విన్నకోట వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కేఎస్పీఎన్ వర్మ, వి.వెంకటేశ్వరరావు, కార్యదర్శులు జక్కంపూడి కుమార్, దాసరి నాని, రెడ్డి వాసు, కోశాధికారి కొణిజేటి గుప్తా తదితరులు కృషి చేశారు. ● చివరి రోజు తొలిగా విజయవాడ జనశ్రేణి వారి ‘గుర్తు తెలియని శవం’ నాటిక ప్రదర్శించారు. ప్రపంచీకరణ, నగరీకరణ నేడు పల్లె ప్రజల జీవనాన్ని, వృత్తులను ఎలా అస్తవ్యస్తం చేస్తున్నాయో తెలియజెప్పింది. రచన వై.భాస్కరరావు, దర్శకత్వం వైఎస్ కృష్ణేశ్వరరావు. రెండోదిగా ప్రదర్శించిన హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ వారి ‘అందిన ఆకాశం’ మానవ సంబంధాలకు ఇవ్వాల్సిన విలువను తెలియజేసింది. రచన అనంత హృదయరాజ్, దర్శకత్వం దేవాబత్తుల జార్జి.
అందిన ఆకాశం నాటికలో...