logo

నూరు శాతం ఎప్పటికి?

ఈ నెల 20 లోపు రబీ వరినాట్లు పూర్తి చేయాలి.. ఈనెల 18న జలవనరులు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ అంబేద్కర్‌ ఆదేశాలివి.

Published : 21 Jan 2022 05:20 IST

రబీ వరినాట్ల లక్ష్య సాధనలో మందగమనం

ఈ నెల 20 లోపు రబీ వరినాట్లు పూర్తి చేయాలి.. ఈనెల 18న జలవనరులు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ అంబేద్కర్‌ ఆదేశాలివి.

కాని క్షేత్రస్థాయిలో 80 శాతమే పూర్తయ్యాయి. లక్ష్యం మాత్రం పూర్తయ్యేలా లేదు. పైగా ఈనెల 25 నుంచి వారబందీ నిర్వహణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గోదావరిలో జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే గుబులు రైతులను వెంటాడుతోంది. ఈ సీజన్‌ ఏదోలా గట్టెక్కితే ఇదే పదివేలని సగటు రైతు కోరుకుంటున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

ఖరీఫ్‌లో వర్షాలతో దెబ్బతిన్న పంటల్ని కాపాడుకోవడానికే రైతులకు చాలా కాలం పట్టింది. దీంతో ఆ ప్రభావం రబీపై పడింది. అధికారుల లెక్క ప్రకారం నాట్లు పూర్తయ్యితే ఇక పంట చేతికొచ్చే వరకు అవసరాలకు నీరు అందించడమే తరువాయి. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నా... అప్పుడే కొన్నిచోట్ల రైతుల అవసరాలకు అందని పరిస్థితి ఉంది.

ఏటా రబీ సీజన్‌ డిసెంబరు 1 నుంచి ప్రారంభించి మార్చి 31కి రబీ పూర్తయ్యేది. ఈ ఏడాది అధిక వర్షాలతో ఖరీఫ్‌ పంటను ఒబ్బిడి చేసుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. దీంతో డిసెంబరు 15 నుంచి రబీకి సాగునీరు అందించారు. జనవరి 20కి నూరు శాతం నాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించినా నిర్దేశిత గడువుకు పూర్తి కాలేదు. రబీలో సాగునీటి అధిగమించడానికి రూ.6.50 కోట్లతో కార్యాచరణను జలవనరులశాఖ అధికారులు రూపొందించారు. దీనిలో భాగంగా షట్టర్ల మరమ్మతులు, కర్రనాచు, గుర్రపుడెక్క తొలగింపు, ఎత్తిపోతల పథకాలున్నచోట్ల మోటార్ల ఏర్పాటు, అత్యవసరమైన చోట్ల మట్టి పూడికతీత, మెరక, కాలువ శివారు ప్రాంతాల్లో అనుమతించిన ఇంజిన్లకు ఆయిల్‌ సరఫరా వంటి పనులు ఉన్నాయి. మురుగునీటి పారుదలశాఖలో మేజర్‌, మీడియం, మైనర్‌ డ్రయిన్లపై 137 చోట్ల అడ్డుకట్టల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వ్యవసాయశాఖ, జలవనరులశాఖ అధికారులు సమన్వయంతో వరినాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాట్లు ముమ్మరం చేస్తున్నామని పశ్చిమ డెల్టా విభాగం ఈఈ దక్షిణామూర్తి తెలిపారు.

తగ్గుతున్న జలాలు.. ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద నీటిమట్టం (ఫాండ్‌ లెవెల్‌) 13.04 మీటర్లుంటే ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సాగునీటికి ఇబ్బందులు లేనట్లే లెక్క. అయితే ప్రస్తుతం ఆనకట్ట వద్ద 12.86 మీటర్లు మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డెల్టాకు ఈ జలాలు ధాటిగా వెళ్లేది కష్టమే. నీటిమట్టం తక్కువ కావడంతో కాలువల్లో ప్రవాహ వేగం నెమ్మదిస్తుందనే వాదన ఉంది. గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కనీసం రోజుకు 10వేల క్యూసెక్కులు ఇవ్వాలి. కాని గోదావరిలో నీటి కొరతతో 9,240 మాత్రమే అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని