logo

సొమ్ములు రాక.. పెట్టుబడి లేక

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

Published : 27 Jan 2022 06:00 IST

44 శాతం రైతులకు అందని ధాన్యం డబ్బు


ఉండిలో ఒక మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు

భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

నిర్ణీత లక్ష్యంలో 71.63 శాతం ధాన్యాన్నే అధికారికంగా సేకరించగలిగారు. మిగిలిన 28.37 శాతం పంట రైతుల వద్దే ఉందని యంత్రాంగం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే కొంత మినహా ధాన్యమంతా సాగుదారుల నుంచి వ్యాపారుల వద్దకు చేరినట్లు స్పష్టమవుతోంది. విక్రయించిన ధాన్యం సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు నిత్యం తిరుగుతూనే ఉన్నారు.

జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగైంది. గత నవంబరులో అధిక వర్షాల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయి. డెల్టాలో పంట కాలువలు, డ్రెయిన్లకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 20-25 బస్తాల దిగుబడి కూడా గగనమైపోయింది. మరోవైపు నీటి లభ్యత తగ్గిపోతుండటంతో రబీ పనులు వెనువెంటనే చేపట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి దశలో ఒడ్డుకు చేరిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ, గింజలో నాణ్యతా లోపాలు తదితర సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో పంటను కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించినట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడి బాగున్నచోట సైతం సాగు కోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారులకే ధాన్యాన్ని అప్పగించారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లోనే పంట విక్రయించుకోవాలని అధికారికంగా సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ అంతా ఈ కేంద్రాల్లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. పంట మాత్రం కేటాయించిన మిల్లులకు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో నేరుగా చేరుతోంది.

ఇదీ పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 21 రోజులకు సంబంధిత రైతు ఖాతాల్లో నగదు జమ అవుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ 30- 40 రోజుల దాటిపోయినా నగదు జమకాలేదని పలువురు సాగుదారులు వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యల వల్ల మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు కొన్నిచోట్ల వినియోగంలో లేకపోవడం, ఆధార్‌ అనుసంధానం చేయకపోవడం, ఫోన్‌ నెంబరు లింకేజీ కాకపోవడం తదితర సాంకేతిక సమస్యలు రైతులకు శాపాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే తప్ప సొమ్ము పడని పరిస్థితి. మరోపక్క రబీ నాట్లు పూర్తి చేసి వెనువెంటనే ఎరువులు చల్లాల్సిన దశలో కొత్త పెట్టుబడుల కోసం అన్నదాతలు అనేక పాట్లు పడుతున్నారు. పంట విక్రయించిన రైతుల్లో దాదాపు 44 శాతం మంది సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు.

సాంకేతిక లోపాలే కారణం

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పంట విక్రయించిన 21 రోజుల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. బ్యాంకు ఖాతాల నిర్వహణ సరిగా లేనిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సరిచేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి. ఈ లోపే లక్ష్యం మేర కొనుగోళ్లు పూర్తిచేస్తాం.- దాసి రాజు, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని