logo

కాలువలకు..వచ్చేనా మంచి రోజులు?

జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పంట కాలువలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మురుగుకాలువలైతే మరింత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు ముందుకు కదలనంటోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన

Published : 20 May 2022 06:03 IST

 గుత్తేదారులు ముందుకొస్తేనే పనులు


తూడుతో నిండి ఉన్న రాయలం డ్రెయిన్‌

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పంట కాలువలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మురుగుకాలువలైతే మరింత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు ముందుకు కదలనంటోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రానున్నది వర్షాకాలం.. వాటి పరిస్థితి ఇప్పుడున్నట్లే ఉంటే పొలాలు చాలా వరకు ముంపునకు గురవుతాయి. పలు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. ప్రస్తుతం పనులు జరుగుతాయో లేదో అనే అనుమానం ప్రజల్లో నెలకొని ఉంది. పంట కాలువలు, మురుగు కాలువల్లో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) కింద ప్రస్తుతం నిర్వహించాల్సిన పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదని కొందరు ఇప్పుడు చేసినా ఇస్తారనే గ్యారంటీ లేదని మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన కాలువల పనులపై సందిగ్ధం నెలకొంది. అసలు ఈ సీజన్‌లో పనులు జరుగుతాయా అనే అనుమానాలు అటు ప్రజల నుంచి, ఇటు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దేవరకోడు, గునుపూడిసౌత్, బొండాడ, రాయలం, గొంతేరు, మొగల్తూరు తదితర డ్రెయిన్లు దారుణంగా ఉండి వాటి పరిధిలో ముంపు ముప్పు పొంచి ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు  ఆందోళన వ్యక్తం చేశారు. గోస్తనీ వేల్పూరు, నరసాపురం, ఉండి, అత్తిలి, వెంకయ్యవయ్యేరు, లోసరి తదితర పంట కాలువల పరిస్థితి అదే విధంగా ఉంది.

* కాలువల్లోకి నీరు విడుదల చేసే సమయం దగ్గరికొచ్చినా కాలువల ప్రక్షాళన పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాబోయే  రోజులు ఎంతో ముఖ్యం. ముఖ్యమైన పనులన్నీ త్వరితగతిన చేయించండి. - భీమవరంలో బుధవారం జరిగిన జిల్లా సాగునీటి పారుదల సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ 
* బిల్లులు రావడం లేదని గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు సార్‌.   - జలవనరుల శాఖ అధికారులు  ఇచ్చిన సమాధానం 

* ఇటీవల బిల్లులు పొందిన గుత్తేదారులను పిలిచి మాట్లాడి వారితోనే ఆ పనులు చేయించండి.. బిల్లులు ఇప్పించే పని నేను చూసుకుంటా.. ఈ ఏడాది చేసిన పనులకు పెండింగులు ఉండవు. - ఉప ముఖ్యమంత్రి హామీ 
* ఈ నెల 23న ఇప్పటికే పిలిచిన టెండర్లను తెరవనున్నాం. పనులు చేయిస్తాం. - జలవనరుల శాఖ అధికారులు


అధ్వానంగా ఉన్న లోసరి పంట కాలువ

పనులు చేయించేలా..
ఈ నెల 23న టెండర్లు తెరవగానే గుత్తేదారులతో మాట్లాడి 24 నుంచి పనులు ప్రారంభించేలా మా వంతు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా పంట, మురుగు కాలువలన్నింటిలో తూడు తొలగింపు పనులు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.      నాగార్జునరావు, జలవనరుల  శాఖ జిల్లా అధికారి, భీమవరం 

ఇదీ పరిస్థితి..
* మొత్తం 27 మురుగు కాలువల్లో పూడిక  తీసేందుకు టెండర్లు పిలవగా 17 పనులకు మాత్రమే స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఓఅండ్‌ఎం కింద ఇప్పుడు మురుగు కాలువల్లో తూడు తొలగించేందుకు 32 పనులకు రూ.6.84 కోట్లు కేటాయించారు. 
* పంట కాలువలకు సంబంధించి గతంలో 64 పనులకు టెండర్లు పిలవగా 20 పనులకు మాత్రమే గుత్తేదారుల నుంచి స్పందన వచ్చింది. తాజాగా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద రూ.4.46 కోట్లు కేటాయించారు. 42 పనులుగా విభజించి ఇటీవల టెండర్లు పిలిచారు. 
* తూడు తొలగింపునకు 74 పనులకు ఈ నెల 23న టెండర్లు తెరవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేదంటే ఈ సీజన్‌లోనూ రైతులకు తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని