logo

అందని వేతనం.. ఎలా జీవనం?

ఫోన్‌ కాల్‌ రాగానే ఆగమేఘాలపై ఘటనాస్థలికి చేరుకుంటాం. క్షతగాత్రులు, బాధితులను 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చుతాం. విధుల్లో ఎంతో చురుగ్గా ఉంటాం. ఇంతకీ వాహన వేగమంతగా మా కుటుంబ బండి కదలడంలేదు. రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు

Published : 20 May 2022 06:03 IST

108, 104 సిబ్బందికి  రెండు నెలలుగా  జీతాల్లేవు

కైకలూరు, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే  ఫోన్‌ కాల్‌ రాగానే ఆగమేఘాలపై ఘటనాస్థలికి చేరుకుంటాం. క్షతగాత్రులు, బాధితులను 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చుతాం. విధుల్లో ఎంతో చురుగ్గా ఉంటాం. ఇంతకీ వాహన వేగమంతగా మా కుటుంబ బండి కదలడంలేదు. రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. అప్పులు చేసి బతుకు బండిని అష్టకష్టాలతో నడుపుతున్నాం.  - ఏలూరు జిల్లాలోని 108 వాహన ఓ చోదకుడి ఆవేదన
* నెల వేతనం సకాలంలో వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. జేబులో డబ్బులు లేకుండా బయటకు వెళ్లాలంటే సిగ్గు పడుతున్నాం. కిరాణా దుకాణంలో నిత్యావసరాలకు చెల్లించాల్సిన నగదు రెండు నెలలుగా బకాయి ఉంది. సరకులకు పిల్లలు వెళ్తుంటే ధరలు పెరిగిపోయాయి.. అప్పులు చెల్లిస్తేనే ఇస్తామని దుకాణదారుడు అంటున్నాడని ఇంటికొచ్చి వారు చెబుతుంటే మానసికంగా కుమిలిపోతున్నాం. - భీమవరం నియోజకవర్గంలోని ఓ ఉద్యోగి వేదన 

108, 104 వాహనాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వందలాది మంది బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వీరు రేయింబవళ్లు విధుల్లో ఉంటున్నారు.

ఉద్యోగుల ఆక్రందన 
మండలానికి ఒక 108 వాహనం అందించడంతో సిబ్బంది సైతం పెరిగారు. వీరికి సర్వీసు ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల నుంచీ వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకుని విధులు నిర్వహిస్తున్నారు. జీతాలు అందకపోవడంతో ఇంటి అద్దె, విద్యుత్తు ఛార్జీలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ‘సకాలంలో అద్దె ఇవ్వకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమంటున్నారు’ అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

* ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 108, 104 వాహనాలు 92 ఉన్నాయి. వీటిల్లో ఈఎంటీలు, చోదకులు, పైలట్లు, వైద్యులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. ఒక్కో వాహనం 5, 6 కేసులకు నిత్యం హాజరవుతుంది. గర్భిణులను ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడం, ఓచోట నుంచి వేరొక ఆసుపత్రికి తీసుకెళ్లడంలో వీరంతా కీలకం. ఈ విషయమై 108 వాహన జిల్లా మేనేజరు కె.గణేష్‌ మాట్లాడుతూ.. వేతనాలను రెండ్రోజుల్లో విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లులు సిద్ధం చేశామన్నారు. 
సమయంతో సంబంధం లేకుండా 24 గంటలూ అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న వీరికి రెండు నెలల నుంచి జీతాలు అందడం లేదు. ప్రతినెలా 5వ తేదీలోపు చెల్లించాల్సిన జీతాలు సగం రోజులు గడిచినా రాలేదు. యాజమాన్యాన్ని సంప్రదిస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని చెబుతున్నారని యూనియన్‌ నాయకులు వాపోతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని