logo

విహారంలో విషాదం

తనకిష్టమైన ఫార్మసీ కోర్సు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది ఆ యువతి కల. కానీ ఆ ఆశలన్నీ సముద్రం పాలయ్యాయి. అలల రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. తమ బిడ్డ ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు

Published : 24 May 2022 04:28 IST

మంగినపూడి బీచ్‌లో పిప్పర యువతి దుర్మరణం

ప్రమీలా రాణి జాస్మిన్‌ (పాత చిత్రం)

గణపవరం, మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: తనకిష్టమైన ఫార్మసీ కోర్సు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది ఆ యువతి కల. కానీ ఆ ఆశలన్నీ సముద్రం పాలయ్యాయి. అలల రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. తమ బిడ్డ ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతే మిగిలింది. గణపవరం మండలం పిప్పరకు చెందిన కాకర అగస్టీన్‌, సుభాషిణి దంపతుల కుమార్తె కాకర ప్రమీలా రాణి జాస్మిన్‌(22) భీమవరం విష్ణు కళాశాలలో ఇటీవలే బీఫార్మసీ పూర్తి చేసింది. రెండురోజుల కిందట కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని స్నేహితురాలు కె.పూజిత(22) ఇంటికి..మరో స్నేహితురాలు గరగపల్లి గ్రామానికి చెందిన డి.ఆశాజ్యోతితో కలిసి వెళ్లింది. ముగ్గురూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ లోపలికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొనఊపిరితో ఉన్న పూజిత, ప్రమీలారాణి జాస్మిన్‌లు ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతిచెందారు. ఆశాజ్యోతి మాత్రం తేరుకుంది. అప్పటివరకు తనతో సరదాగా గడిపి అంతలోనే విగతజీవులుగా మారిన స్నేహితురాళ్లను చూస్తూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న ప్రమీలారాణి జాస్మిన్‌ తల్లిదండ్రులు మచిలీపట్నం చేరుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించిన తమ కుమార్తెలను చూడలేక రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఘటనపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని