logo

శంకుస్థాపనలతో సరి!

ప్రొద్దుటూరు పట్టణంపై ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధుల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గతేడాది డిసెంబరు 23వ తేదీన పర్యటించారు. మొత్తం 9 అభివృద్ధి పనులకు రూ.515.40 కోట్లు కేటాయిస్తూ, శిలాఫలకాలు ఆవిష్కరించారు.

Published : 28 Jun 2022 06:04 IST

రూ.515.40 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శిలాఫలకాలు

టెండర్ల దశలోనే ఉన్నాయంటున్న అధికార యంత్రాంగం

ప్రొద్దుటూరు పట్టణంలో ముందుకు పడని ప్రగతి అడుగులు

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు

గతేడాది డిసెంబరు 23న శిలాఫలకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి,

ఎమ్మెల్యే శివప్రసాదురెడ్డి (పాత చిత్రం)

ప్రొద్దుటూరు పట్టణంపై ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధుల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గతేడాది డిసెంబరు 23వ తేదీన పర్యటించారు. మొత్తం 9 అభివృద్ధి పనులకు రూ.515.40 కోట్లు కేటాయిస్తూ, శిలాఫలకాలు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చొరవతో ప్రగతి పరుగులు తీస్తుందని, ఏళ్లనాటి సమస్యలు పరిష్కారమవుతాయని పట్టణ వాసులందరూ సంతోషించారు. ఆరు నెలలు గడిచినా అతీగతి లేదు. అభివృద్ధి పథకాలకు పునాది రాయి పడలేదు. అర్ధ సంవత్సరమైనా దస్త్రాలకే పరిమితమైంది. అవి ఏ దశలో ఉన్నాయి...వాటి స్థితిగతులపై ‘న్యూస్‌టుడే’ క్షేత్రస్థాయి పరిశీలనలో పలు అంశాలు వెలుగు చూశాయి.

ప్రొద్దుటూలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి

* ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వసతులలేమి, సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిని చక్కదిద్దడానికి రూ.20.50 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే 300 పడకల ఆసుపత్రి కష్టాలు తీరినట్లే. టెండర్ల దశలో ఉందని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సురేంద్రనాథ్‌ తెలిపారు.

* ప్రొద్దుటూరు పట్టణంలో 70 ఏళ్లనాటి తాగునీటి పైపులైనులో కలుషిత నీటి సమస్యను అధిగమించేందుకు రూ.119 కోట్లతో 171 కి.మీ. కొత్తపైపులైను, 4 ఉపరితల జలాశయాలు నిర్మించాల్సి ఉంది. ఇక్కడ 106 ఏళ్ల నుంచి మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేదు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు దోమల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు 5 ప్రధాన మురుగు కాలువల ఆధునికీకరణ, మురుగునీటి శుద్ధి కర్మాగారం రూ.163 కోట్లతో నిర్మించాల్సి ఉంది. శిథిలావస్థలో ఉన్న 40 ఏళ్ల నాటి కూరగాయల మార్కెట్‌ను తొలగించి కొత్త మార్కెట్‌, వాణిజ్య సముదాయ భవనాల ఏర్పాటుకు రూ.50.90 కోట్లు కేటాయించారు. సీసీ రహదారులు, కల్వర్టులు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులకు పురపాలక సాధారణ, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15 కోట్లు కేటాయించారు. ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిపై పుర పాలక సంఘం కమిషనర్‌ పి.వి.రమణయ్య మాట్లాడుతూ పైన మూడు పనులు టెండర్ల దశలో ఉన్నాయని, రూ.15 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయని ఆయన వివరించారు.


 

పెన్నానదిపై వంతెన నిర్మించాల్సిన ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీకెళ్లే దారిదే

* ప్రొద్దుటూరులో పెన్నానదిపై నుంచి ఆర్టీపీపీకెళ్లే మార్గం వరదల ధాటికి కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. దీన్ని అధిగమించడానికి నదిపై ఓవరు బ్రిడ్జి కట్టడానికి రూ.53 కోట్లు కేటాయించారు. ఈ పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని రహదారులు, భవనాలశాఖ ఈఈ నరసింహారెడ్డి వివరించారు.

* పట్టణంలోని యోవేవి వైఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల్లో గదుల కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేందుకు అదనపు తరగతి గదులు, వసతి భవనాల కల్పనకు రూ.66 కోట్లు కేటాయించారు. టెండర్ల దశలో ఉందని యోవేవి ఎంబీఏ విభాగం అధికారి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.

దుర్వాసన, దోమలకు ఆవాసమైన కొత్తపల్లె మురుగు కాలువ

* పట్టణంలో 1966లో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కూలిపోయే స్థితిలో ఉంది. కొత్త భవనాలు నిర్మించి, వసతుల కల్పనకు రూ.24 కోట్లు కేటాయించారు. భూసామర్థ్య పరీక్షలు పూర్తయి, టెండర్ల దశలో ఉందని కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌ చెబుతున్నారు.

* పట్టణంలోని 1986 నాటి ఆర్టీసీ బస్టాండు భవనం పైకప్పు సిమెంటు పెచ్చులూడి ప్రయాణికులపై పడేవి. సమస్య పరిష్కారానికి రూ.4.50 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే రోజుకు 60 వేల మంది ప్రయాణికులకు సౌకర్యానిస్తుంది. టెండర్‌ దశలో ఉందని ఆర్టీసీ భవనాల విభాగం ఈఈ వెంకటరమణ చెప్పారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని