logo

రహదారి విస్తరణలో ఉద్రిక్తత!

ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం మహబూబ్‌ సుబానీ దర్గా ప్రహరీని అధికారులు తొలగించే ప్రయత్నాన్ని వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో ఒక్కసారిగా

Published : 28 Jun 2022 06:04 IST

ప్రొద్దుటూరులో జెండా చెట్టు ప్రహరీ కూల్చే ప్రయత్నం అడ్డగింత

పుర వైస్‌ఛైర్మన్‌తోపాటు కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ధర్నా చేస్తున్న వైకాపా  వైస్‌చైర్మన్‌ ఖాజా, కౌన్సిలర్లు, ముస్లిం మైనార్టీలు

ప్రొద్దుటూరు పట్టణం/నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం మహబూబ్‌ సుబానీ దర్గా ప్రహరీని అధికారులు తొలగించే ప్రయత్నాన్ని వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కౌన్సిలర్లు మహమ్మద్‌గౌస్‌, గౌస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న పురపాలక సంఘం వైస్‌ఛైర్మన్‌ ఖాజా ఆధ్వర్యంలో మైనార్టీ కౌన్సిలర్లు ఇర్ఫాన్‌బాషా, మునీర్‌, పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ జబీవుల్లా, మైనార్టీ నాయకులు ఫరీద్‌, మున్నా తదితరులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారమందుకున్న డీఎస్పీ ప్రసాదరావు ప్రత్యేక పోలీస్‌ పార్టీతో ఘటనాస్థలానికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించగా వైస్‌ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసు వాహనాన్ని చాపాడు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మార్గమధ్యలో అడ్డుకోవడంతో ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వైకాపా కౌన్సిలర్లకు మద్దతు తెలిపేందుకు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మార్గమధ్యలో పోలీస్‌ వ్యాన్‌ ఎక్కగా, అందరినీ రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వ్యాన్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి వైస్‌ ఛైర్మన్‌ ఖాజాకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. అనంతరం ఎంపీ పోలీసు అధికారులతో మాట్లాడగా అందరినీ ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛైర్మన్‌ ఖాజా, కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లబోమని, పురపాలక కమిషనర్‌ సున్నితమైన అంశాలను మైనార్టీ కౌన్సిలర్లతో చర్చించకుండా దర్గా ప్రహరీని ఎందుకు కూల్చే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డీఎస్పీ వైఖరి సరిగా లేదని అన్ని పోలీస్‌స్టేషన్లను తిప్పడానికి మేమేమన్నా ఉగ్రవాదులమా అని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ ముందు కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పురపాలక కమిషనర్‌ వివరణ ఇచ్చేవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. వీరికి మద్దతుగా పుర పాలక సంఘం మాజీ ఛైర్మన్‌ షేఠ్‌ గురివిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. తాను పోలీస్‌స్టేషన్‌కు వచ్చేది లేదని, తన ఛాంబర్‌ వద్దే కౌన్సిలర్ల కోసం వేచి చూస్తానని కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు స్పష్టం చేయడంతో పోలీస్‌స్టేషన్‌ వద్దనే నిరసనకారులు ఉండిపోయారు.

నిరసనకారులను లాక్కెళుతున్న పోలీసులు

యథాస్థితికి సమ్మతం

ప్రొద్దుటూరులో జెండా చెట్టు ప్రహరీ తొలగించే అంశంపై వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తుండంతో సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి కౌన్సిలర్లను కలిశారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి మైనార్టీ కౌన్సిలర్లను కలిశారు.  ఎమ్మెల్యే వైస్‌ ఛైర్మన్‌ ఖాజాతో పాటు కౌన్సిలర్లు, మత పెద్దలతో చర్చించారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన అనంతరం వైస్‌ ఛైర్మన్‌ ఖాజా మాట్లాడుతూ జెండా చెట్టును తొలగించడంలేదని.. యథాస్థితిలో ఉంచుతామని కమిషనర్‌కు చెబుతానని ఎమ్మెల్యే చెప్పినట్లు తెలిపారు.  కమిషనర్‌, డీఎస్పీపై చర్య తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాదురెడ్డి రెండు సార్లు గెలుపొందడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని తెదేపా నాయకుడు ఖలీల్‌ అన్నారు. అలాంటి మైనారిటీలు ఉపాధి పొందుతున్న కూరగాయల మార్కెట్‌ను కూలదోశారని, జామియా మసీదు ఆస్తులు దెబ్బతిన్నాయని, దర్గా పడగొట్టేయత్నం చేశారన్నారు. దీనికి నిరసనగా తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. వైకాపా మైనారిటీ నాయకులు రాజీనామా చేసి అందరినీ కలుపుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.

నిరసనల వెల్లువ

దర్గా ప్రహరీ కూల్చివేతకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి, పురపాలక సంఘం అధికారులను అరెస్టు చేయాలని తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండు చేశారు. దీనిపై తెదేపా నాయకులందరితో కలిసి పోరాడతామన్నారు. ఎమ్మెల్యే మోసపూరిత రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌ విమర్శించారు. వైకాపా కౌన్సిలర్లకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి రావాలని తమ మద్దతు తెలుపుతామన్నారు. వైస్‌ ఛైర్మన్‌ ఖాజా మాట్లాడుతూ ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది జరిగితే తమ పదవులకు రాజీనామా చేస్తామని, అవసరమైతే ప్రాణాలర్పిస్తామన్నారు. కమిషనర్‌ సంజాయిషీ ఇవ్వకపోతే ఎంపీ అవినాష్‌రెడ్డికి చెప్పి తమ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. మా ఎమ్మెల్యే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. కౌన్సిలర్‌ మహమ్మద్‌గౌస్‌ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా జెండా చెట్టు ప్రహరీ పడగొట్టడం సరికాదన్నారు. పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ షేఠ్‌ గురివిరెడ్డి మాట్లాడుతూ జెండా చెట్టు ప్రహరీ విషయాన్ని కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి ఉంటే బాగుండేదన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని