logo

పెట్రోల్‌ పోసి వ్యక్తి కాల్చివేత

రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) సమీపంలో కలమల్ల గ్రామ పరిధిలోని వంకలో రామనబోయిన శ్రీనివాసులు (35) అనే వ్యక్తిని అతిదారుణంగా పెట్రోల్‌పోసి కాల్చి చంపిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కలమల్ల

Published : 28 Jun 2022 06:04 IST

రామనబోయిన శ్రీనివాసులు (పాతచిత్రం)

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) సమీపంలో కలమల్ల గ్రామ పరిధిలోని వంకలో రామనబోయిన శ్రీనివాసులు (35) అనే వ్యక్తిని అతిదారుణంగా పెట్రోల్‌పోసి కాల్చి చంపిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కొత్త గోపులాపురం గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు శ్రీనివాసులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం రూ.250 నగదు కోసం రామనబోయిన శ్రీనివాసులు కృష్ణానగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులతో ఘర్షణ పడ్డారు. దీంతో శ్రీనివాసులు సోదరుడు నాగయ్య వారికి డబ్బులు చెల్లించి అతనిని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. తరువాత శ్రీనివాసులు పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం కలమల్ల వంకలో శ్రీనివాసులును కాల్చి చంపబడినట్లు అతని సోదరుడు నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎర్రగుంట్ల గ్రామీణ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి, కలమల్ల ఎస్‌.ఐ శివప్రసాద్‌ పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  


పురుగులమందు తాగి వ్యక్తి మృతి

పెద్దముడియం, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మేడిదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు..మేడిదిన్నెకు చెందిన సుంకన్నగారి పెద్దపుల్లయ్య (33) అనే వ్యక్తి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో సీˆమెంటు పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ కలహాలతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్‌.ఐ శ్రీనివాసులును వివరణ కోరగా తమకు ఇంతవరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.


వృద్ధుడి ఆత్మహత్య

ఖాజీపేట (మైదుకూరు), న్యూస్‌టుడే : ఖాజీపేట మండలం రంగాపురంలో సోమవారం పెద్దగురప్ప (85) అనే వృద్ధుడు విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దగురప్ప విషద్రావణం తాగగా కడప రిమ్స్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని