logo

గాలికొదిలేశారు!

జిల్లాలోని పురపాలక సంఘాలకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ పథకం ద్వారా వాహనాలు రావడంతో అధికారులు పాత చెత్త సేకరణ, తరలింపు యంత్రాలను గాలికొదిలేశారు. టన్నుల కొద్ది చెత్తను తరలించే ట్రాక్టర్లు, డంపర్‌బిన్లు, ఈ-ఆటోలను మూలన పడేశారు. వీటికి సకాలంలో మరమ్మతులు

Published : 28 Jun 2022 06:04 IST

పురపాలక సంఘాల్లో మూలకు చేరిన రూ.లక్షల విలువైన యంత్రాలు

ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని చెత్త తరలింపు ట్రాక్టర్లు, డంపర్లు

గుట్టుచప్పుడు కాకుండా గుజిరీకి తరలిపోతున్న ఆటోలు, విడిభాగాలు

పేరుకుపోతున్న చెత్తనిల్వలు, దుమ్ము, ధూళితో పురప్రజల అవస్థలు

న్యూస్‌టుడే, రాయచోటి, రాజంపేట

జిల్లాలోని పురపాలక సంఘాలకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ పథకం ద్వారా వాహనాలు రావడంతో అధికారులు పాత చెత్త సేకరణ, తరలింపు యంత్రాలను గాలికొదిలేశారు. టన్నుల కొద్ది చెత్తను తరలించే ట్రాక్టర్లు, డంపర్‌బిన్లు, ఈ-ఆటోలను మూలన పడేశారు. వీటికి సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో చాలావరకు గుజిరీకి వెళ్లిపోయాయి. రూ.లక్షల విలువైన యంత్రాలు నిరుపయోగంగా మారడంతో  పట్టణాల్లో రోజులతరబడి చెత్త నిల్వలు పేరుకుపోతుండగా, ప్రధాన రహదారులపై మట్టి, ఇసుక మేటలు వేస్తున్నాయి. ఫలితంగా పట్టణవాసులు రాకపోకలు  సాగించేందుకు నిత్యం అవస్థలు  పడుతున్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంతోపాటు 14, 15వ ఆర్థిక సంఘాల నిధులతో మరమ్మతులకు గురైన రూ.లక్షల విలువ చేసే యంత్రాలను బాగు చేసే దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం.


ఇది జిల్లా కేంద్రమైన రాయచోటి పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో మూలన పడేసిన రహదారులపై దుమ్ము, మట్టిని ఊడ్చే యంత్రం. రూ.5 లక్షలకుపైగా విలువైన ఈ యంత్రం ప్రారంభ రోజున అధికారి చేసిన తప్పిదానికి చెట్టును ఢీకొనడంతో చిన్నపాటి మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది.


* జిల్లాలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె పురపాలక సంఘాలున్నాయి. ఒక్కో పురపాలక సంఘం నుంచి ప్రతిరోజు కనీసం 20 నుంచి 40 మెట్రిక్‌ టన్నులకుపైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నివాసాల సమీపంలో ఏర్పాటు చేసిన డస్టు బిన్లకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి డంపర్‌బిన్‌ (పెద్ద లారీ)ల ద్వారా పట్టణ సమీపంలోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సి ఉంది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టపోవడంతో రూ.లక్షల విలువైన ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతుండడంతో పట్టణాల్లో సకాలంలో చెత్త సేకరణ జరగక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.


తుప్పు పట్టి కనిపిస్తోంది రాయచోటి పురపాలక సంఘం ఆవరణలోని జెసిబి . మరమ్మతులకు గురవ్వడంతో గత మూడేళ్లుగా ఇలా గాలికొదిలేశారు.  రూ.లక్షలు విలువ చేసే ఈ యంత్రం అద్దాలు పగలిపోగా, కొన్ని విడిభాగాలు మాయం కావడంతో ఇలా వృథాగా పడింది.


* రాయచోటి పట్టణంలో ఇటువంటి వాహనాలు మూడు ఉండగా, వాటిల్లో ఒకటి ఏడాదిన్నర కిందట మరమ్మతులకు గురై మూలకు చేరింది. వీధుల్లో చెత్తను సేకరించే 9 ఈ-ఆటోల్లో ఏడు వృథాగా  పడి ఉన్నాయి. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు ఉండగా, వాటిల్లో నాలుగు మరమ్మతులకు గురవ్వడంతో ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా గుజిరీకి వేసేశారు.

* రాజంపేట పురపాలక సంఘంలో మూడు ట్రాక్టర్లు, రెండు డంపర్‌బిన్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒక డంపర్‌ బిన్‌, ఒక ట్రాక్టరుతోపాటు చెత్త సేకరణ వ్యాన్లు మరమ్మతులకు గురికావడంతో మూలన పడేశారు.

* మదనపల్లె పురపాలక సంఘంలో 34 వార్డులుండగా ఇక్కడ రోజు 40 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. పాత వాహనాలను సక్రమంగా వినియోగించకపోవడంతోపాటు చాలా వరకు యంత్రాలు వినియోగించకపోవడంతో మూలకు చేరాయి.

ఒక్కరోజూ వినియోగంలో లేవు...

* రాయచోటి, రాజంపేట పట్టణాలకు మూడేళ్ల కిందట రహదారులపై చెత్త, దుమ్ము, ధూళి శుభ్రం చేసే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే యంత్రాలొచ్చాయి. రాయచోటిలో వాహనాన్ని ప్రారంభించే రోజు ఓ అధికారి నడిపి నేరుగా చెట్టును ఢీకొనడంతో ముందు భాగంలో వాహనం దెబ్బతినడంతో ఒక్కరోజు కూడా రోడ్డుపైకి రాకుండానే నేటికీ పురపాలక సంఘం కార్యాలయంలోనే మూలుగు తోంది. ఇక్కడ పట్టణ రహదారులపై మట్టి, ఇసుకను తొలగించే రూ.5 లక్షలు విలువ చేసే జేసీబీ కేవలం చిన్నపాటి మరమ్మతులకు గురవ్వడంతో కార్యాలయం ఎదుట పడేశారు. గత మూడేళ్లుగా పట్టించు కునేవారు లేకపోవడంతో అద్దాలు పగిలిపోగా, ఇతర సామగ్రి తుప్పుపట్టింది.

* రాజంపేట పురపాలక సంఘానికి కేటాయించిన వాహనం ఇంతవరకు వినియోగించిన దాఖలాల్లేవు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో వృథాగా పడేయడంతో తప్పుపట్టింది.


కమిషనర్లదే బాధ్యత...

పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వినియోగించే వాహనాలు, యంత్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిషనర్లదే. మరమ్మతులకు గురైన వాహనాలను సకాలంలో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వారే చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాహనాలు మూలన పడేసినట్లు మా దృష్టికి వస్తే ఆయా కమిషనర్లతో చర్చించి మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకుంటాం.

- వీవీఎస్‌ మూర్తి, ఆర్డీ, పురపాలకశాఖ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని