logo

చెయ్యేరులో భూగర్బ చెక్ డ్యాంలు లేనట్లేనా...?

ఏటా వరద నీరు కళ్లెదుటే సోమశిలలోకి వృథాగా కలిసిపోతోంది. ఇటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు, రైతులకు గానీ ఉపయోపడకుండా పోతోంది. ఏటా భారీ వర్షాలు పడినప్పుడు చెయ్యేరు నది నుంచి సుమారు 30 నుంచి 50 టీఎంసీల నీరు సోమశిల వెనుక జలాల్లోకి

Published : 28 Jun 2022 06:04 IST

అనుమతులివ్వని భూగర్భ జలవనరులశాఖ

ఏటా వరద నీరు సోమశిలలో కలవాల్సిందే

నదిలో వృధాగా పోతున్న నీరు 

రాజంపేట, న్యూస్‌టుడే : ఏటా వరద నీరు కళ్లెదుటే సోమశిలలోకి వృథాగా కలిసిపోతోంది. ఇటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు, రైతులకు గానీ ఉపయోపడకుండా పోతోంది. ఏటా భారీ వర్షాలు పడినప్పుడు చెయ్యేరు నది నుంచి సుమారు 30 నుంచి 50 టీఎంసీల నీరు సోమశిల వెనుక జలాల్లోకి చేరుతోంది. దీనివల్ల నష్టం తప్ప ప్రయోజనం లేకుండాపోతోది. ఎలాగైనా వృథాగా వెళ్లే నీటికి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి భూగర్భ జలమట్టాన్ని పెంచాలని అధికారులు భావించారు. ఆమేరకు ప్రజా ప్రతినిధులు కూడా సిద్ధమయ్యారు. ప్రతిపాదనలూ పంపారు. కానీ చెయ్యేరు నదిలో భూగర్భ చెక్‌డ్యాంలను(సబ్‌ సర్ఫేస్‌ డ్యాం) నిర్మించడానికి భూగర్భ జలవనరులశాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది.

* చెయ్యేరు నదిపై బాదనగడ్డ వద్ద అన్నమయ్య జలాశయం ఉంది. ఈ జలాశయం సామర్థ్యం కేవలం 2.24 టీఎంసీలు మాత్రమే కావడంతో అదనంగా ప్రాజెక్టుకు వచ్చే నీటిని నదిలోకి విడుదల చేస్తారు. ఆ నీరంతా నేరుగా సోమశిలలో కలుస్తుంది. నదీపరివాహక ప్రాంతాల వెంబడి చెరువులు, ఊటకాలువలు వంటివి ఎన్నో ఉన్నాయి. సాధారణంగా నదిలో నీరు పారితే చెరువులు, ఊట కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. సక్రమంగా కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా సోమశిలలో కలుస్తోంది.

రెండేళ్ల కిందటే రూ.95 కోట్లతో ప్రతిపాదనలు

సోమశిలలోకి కలిసే నీటికి అడ్డుకట్ట వేయడానికి రెండేళ్ల క్రితం నదిలో అక్కడక్కడా సబ్‌సర్ఫేస్‌ డ్యాంలను నిర్మించాలని భావించి అధికారులతో పాటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. సుమారు రూ.95 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. చెయ్యేరు నదిపై సబ్‌సర్ఫేస్‌ చెక్‌డ్యాంలను నిర్మించవచ్చా..? నిర్మించడానికి అవకాశముందా...? నిర్మిస్తే నీరు నిల్వ ఉంటుందా..? అనే విషయాలపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలించింది. ఇక్కడ సబ్‌సర్ఫేస్‌ చెక్‌డ్యాంలను నిర్మించడానికి అనువైన పరిస్థితులు లేవని, ఇక్కడ నిర్మించినా ప్రయోజనం ఉండదనే భావనతో ఆశాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో బృహత్తరమై ఈ పథకం ముందడుగు వేయలేదు.

నీటికి అడ్డుకట్ట వేస్తే ప్రయోజనం

ప్రస్తుతం అన్నయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో పైతట్టు ప్రాంతం నుంచి వస్తున్న నీరు చెయ్యేరునదిలో సాఫీˆగా సాగుతోంది. ఈ నీటి వల్ల సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెయ్యేరు నదిలో భారీగా ప్రవహించే నీటికి మరో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అడ్డుకట్ట వేయగలిగితే అటు పైతట్టు, ఇటు దిగవ ప్రాంత ప్రజల, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి.


అనుమతులు ఇవ్వలేదు

చెయ్యేరునదిలో ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేస్తూ ఎక్కడి నీటిని అక్కడే భూమిలోకి ఇంకింప చేయడానికి సబ్‌సర్ఫేస్‌ చెక్‌డ్యాంలను నిర్మించాలని భావించాం. నదిలో వీటిని నిర్మించడానికి అన్ని కోణాల్లో పరిశీలించిన భూగర్భ జలవనరులశాఖ అనుమతి ఇవ్వలేదు.

-రవికిరణ్‌, ఈఈ, అన్నమయ్య జలాశయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని