logo

అది నుంచి ఆయనది ప్రత్యేక ముద్ర!

ఆయన ఒంటినిండా దేశభక్తి... విద్యార్థి దశలోనే ఆయనలో ఉద్యమకాంక్ష రగిలింది.... ఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు చేయాలని ఉక్కు పిడికిలి బిగించారాయన... అలుపెరగని పోరాటం చేయాలని సంకల్పించారు... దేశం కోసం నేనుసైతం అంటూ ఉత్సాహంతో సంగ్రామంలోకి దూకి తెల్లదొరలపై దండెత్తారు....

Updated : 13 Aug 2022 07:19 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటపటిమ

జైలుశిక్ష అనుభవించిన సమరయోధుడు

ఎమ్మెల్యే, ఎంపీగా ప్రజలకు విశేషసేవలు

వై.ఆదినారాయణరెడ్డి ప్రత్యేక శైలి ఇది

- న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, సుండుపల్లి

నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో ఆదినారాయణరెడ్డి

ఆయన ఒంటినిండా దేశభక్తి... విద్యార్థి దశలోనే ఆయనలో ఉద్యమకాంక్ష రగిలింది.... ఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు చేయాలని ఉక్కు పిడికిలి బిగించారాయన... అలుపెరగని పోరాటం చేయాలని సంకల్పించారు... దేశం కోసం నేనుసైతం అంటూ ఉత్సాహంతో సంగ్రామంలోకి దూకి తెల్లదొరలపై దండెత్తారు.... సత్యాగ్రహంలో పాల్గొని దేశం కోసం జైలు శిక్ష అనుభవించారు.... శాసనసభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా నమ్మిన ప్రజలకు విశేష సేవలందించారు... ఆయనే వై.ఆదినారాయణరెడ్డి.

సుండుపల్లి మండలం రెడ్డివారిపల్లెకు చెందిన యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి 1916, అక్టోబరు 15న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు రాములమ్మ, నాగిరెడ్డి. ఈయన సుండుపల్లి, రాయచోటి, నందలూరులో పదోతరగతి వరకు చదువుకున్నారు. అనంతరం మదనపల్లె బీటీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే జైలు నుంచి విడుదలైన మార్గరెట్‌కు ఘన స్వాగతం పలికారు. పరీక్షలు రాయడానికి 1937లో అనంతపురం వెళ్లారు. అక్కడే రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డితో పరిచయం ఏర్పడింది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 1938లో డిగ్రీ పట్టా పొందారు. పాతికేళ్ల వయసు నిండక ముందే 1940లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీజీ ఉద్యమ పిలుపుతో ఆకర్షితులై సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా 1942లో మరోసారి అరెస్టయి 1943లో పెరోల్‌పై విడుదలయ్యారు. అనంతరం 1950లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఎన్నిక కాగా, 1952, 1955లలో శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఈ ప్రాంతంలో వర్షాభావం, దుర్భిక్షం సమస్యలపై నాటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, సి.రాజగోపాలాచారి దృష్టికి తీసుకెళ్లి రాయచోటికి ఆహ్వానించారు. కరవుతో అల్లాడిపోతున్న పేదల కోసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించారు. స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి గండికోట జలాశయం నిర్మాణానికి ఉద్యమించారు. జలస్ఫూర్తితో అనేక చెరువులు తవ్వించారు. పింఛ జలాశయంతోపాటు కంచాలమ్మ గండి, ఊట చెరువుల నిర్మాణం, కడప ఆకాశవాణి కేంద్రం ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. 1964, 1982లో రెండు పర్యాయాలు రాజ్యసభసభ్యుడిగా ఎనలేని సేవలందించారు. 1985లో థాయ్‌లాండ్‌లో, 1986లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా అమెరికాలో పర్యటించారు. అప్పటి ప్రధానమంత్రులు లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, వి.వి.గిరి, ఆర్‌.వెంకట్రామన్‌, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆజాద్‌ హింద్‌ పత్రికను స్థాపించి సంపాదకుడిగా పనిచేశారు. వ్యవసాయం చేస్తున్న అన్నదాతల బిడ్డల కోసం విద్యాలయాలను నిర్వహించారు. 2002, జూన్‌ 8న తుదిశ్వాస విడిచారు.


పోరాడదాం లేదా మరణిద్దాం

తెల్లదొరల నుంచి భరతమాతకు విముక్తి కల్పించే పోరాటంలో ‘పోరాడదాం లేదా మరణిద్దాం’ అంటూ యువతను తట్టి లేపి స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు పులివెందుల తాలూకా  సింహాద్రిపురం మండలం వైకొత్తపల్లెకు చెందిన చవ్వాబాలిరెడ్డి. 1940లో ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగా గాంధీజీ శంఖారావంతో ప్రభావితుడై వేముల మండలం పెద్దజూటూరులో వ్యక్తి సత్యాగ్రహం చేసి 5 నెలలపాటు జైలుశిక్ష అనుభవించారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో మరోసారి కారాగారంలో 18 నెలలపాటు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశంపంతులుతో కలిసి జైలుజీవితం గడిపారు. 1947లో కడప చేనేత కాంగ్రెస్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య, ప్రకాశంపంతులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పులివెందుల మండలం అచ్చువెల్లిలో కరవు నివారణ సభ నిర్వహించి గుర్తింపు పొందారు. 1962లో పులివెందుల తాలూకా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పెంచికల బసిరెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 34 మంది శాసనసభ్యులు గల యునైటెడ్‌ డెమోక్రటిక్‌ సంఘానికి ఉపాధ్యక్షునిగా పనిచేసి శాసనసభలో రాయలసీమ సమస్యలపై గళమెత్తారు. రెండు సార్లు ఆంధ్ర విశ్వవిద్యాలాలయం సెనెట్‌ సభ్యునిగా, 1965లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ కమిటీ కార్యదర్శిగా, తితిదే, శ్రీశైలం పాలకవర్గం సభ్యునిగా సేవలందించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులను చైతన్యపరిచి వారి శ్రేయస్సుకు కృషి చేశారు. 1998లో మరణించారు.

-న్యూస్‌టుడే, లింగాల, సింహాద్రిపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని