logo
Published : 15 Aug 2022 03:59 IST

పరిహారం.. పరిహాసం!

పంటపొలాలను ముంచెత్తిన సోమశిల వెనుక జలాలు
పంటలు సాగుచేయలేక.. కాసులందక రైతుల దిగాలు
ఇదీ సోమశిల జలాశయం పరిధిలో భూసేకరణ తీరు

నందలూరు మండలం చాపలవారిపల్లెలో మునిగిన వరి

పసిడి పంటలు పండే బంగరు భూములు... తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారం... నేలతల్లితో వీడదీయరాని అనుబంధం... పుడమి ఒడితో మమేకమై పచ్చని పంటలు సాగు చేస్తున్న రైతులకు ముంపు శరాఘాతంగా మారింది... మూడు దశాబ్ధాలుగా భూసేకరణ ప్రక్రియ సాగుతూనే ఉంది... కొంతమంది రైతుల పొలాలకు పైసా పరిహారం ఇవ్వకుండానే నిండా ముంచేశారు... ముంపు భయంతో పైర్లు సాగు చేయడం లేదు... పసిడి నేలలు బీడుగా దర్శనమిస్తున్నాయి. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం లేదని, కాసింతైనా కనికరం చూపడం లేదని బాధితులు ఆక్రోశిస్తున్నారు. - న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, పెనగలూరు, బద్వేలు, అట్లూరు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మించిన సోమశిల జలాశయంతో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని విలువైన భూములు నీటిపాలయ్యాయి. ఈ రెండు జిల్లాలోని ఒంటిమిట్ట, అట్లూరు, సిద్దవటం, గోపవరం, నందలూరు, పెనగలూరు మండలాల్లో పూర్తిగా 105, పాక్షికంగా మరో తొమ్మిది పల్లెలు ముంపు జాబితాలో చేరాయి. ఆరు మండలాల పరిధిలో ప్రభుత్వ, పట్టా, డీకేటీ, అటవీ, ఆలయాల మాన్యాలు, ప్రార్థన మందిరాలకు చెందిన భూములను 62,843.48 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జలాశయం పనులకు 1975 జూన్‌ 4న శంకుస్థాపన చేశారు. పూర్తయిన అనంతరం 1988, నవంబరు 26న జాతికి అంకితం చేశారు. ఇంకా భూసేకరణ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇప్పటికే 61,836.40 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.626.58 కోట్లు పరిహారం రూపంలో రైతులకు, ప్రభుత్వ శాఖల ఆస్తుల కోసం చెల్లించారు. ఇంకా 1,007.08 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలంటే మరో రూ.128.71 కోట్లకు పైగా కావాలని జీఎన్‌ఎస్‌ఎస్‌ భూసేకరణ విభాగం అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు, గంగపేరూరులో 7, 8, 9, 10 రీచ్‌ల పరిధిలో 140 ఎకరాలకుగానూ రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. భూమిని కోల్పోయే రైతులతో భూసేకరణ అధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి ఒప్పించారు. ఎకరా విస్తీరణంలో ఉన్న మెట్ట భూమికి రూ.8 లక్షలు, మగాణికి రూ.9.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇంత కంటే ఎక్కువగా ఇవ్వాలని అన్నదాతలు డిమాండు చేస్తున్నారు. సోమశిల పూర్తి నిల్వ సామర్థ్యం 77.988 టీఎంసీలు. 75-78 టీఎంసీలు నిల్వ చేస్తే ఇప్పటికీ డబ్బులు ఇవ్వని రైతులకు చెందిన పంట పొలాలు కూడా మునకలో చేరుతున్నాయి. గత మూడేళ్లుగా చూస్తే 2019, 2020, 2021లో వరుసగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పంటల్ని ముంపు ముంచెత్తుందని తెలిసినా కొంతమంది సాహసం చేసి పైర్లు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న తర్వాత ఆశల పంట చేతికందే సమయంలో వెనుక జలాలు రావడంతో మునకలో చేరి జలార్పరణం అవుతోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి దక్కడం లేదు.

ఆశలు ఆవిరి
సోమశిల వెనుక జలాల రాకతో గుంజనేరు పరివాహకంలో ఇరువైపుల ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. నందలూరు మండలం చాపలవారిపల్లె గ్రామపరిధిలో సుమారు 20 ఎకరాల వరి పంట (కోత దశలో) ముంపులో చేరింది. పుట్లకొద్దీ ధాన్యం నీటిపాలవుతున్నాయని కర్షకులు కంటతడి పెడిడుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి రోజురోజుకు నీటిమట్టాలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సారి ధాన్యం చేతికొస్తుందని ఆశించిన అన్నదాతలపై సోమశిల నీరు నిండా ముంచేసింది. పచ్చని పంట ఆశాజనకంగా ఉండటంతో ఇక తిండి గింజలకు కరవు ఉండదని ఆశించారు. అయితే ముంపు రూపంలో హలధారి ఆశలు ఆవిరయ్యాయి. పొత్తపి గ్రామాన్ని సోమశిల బాధిత గ్రామంగా ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇంతవరకు ఇక్కడున్న ఇళ్లకు పరిహారం చెల్లింపులపై ఎలాంటి భరోసా ఇవ్వలేదు. భూములకు దాదాపు డబ్బులిచ్చేశారు. సమీపంలోని పొలాలకు ఇవ్వాల్సి ఉంది. బహుదా నది ఒడ్డునే ఈ పల్లె ఉంది. భూములు తీసుకున్నారు. ఇళ్ల మాట అడిగితే స్పష్టమైన హామీ లభించలేదు. ఇక్కడే ఉంటూ ఏం తిని బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఎదురుచూసేకొద్దీ నిరాశే
అట్లూరు మండలం చింతువాండ్లపల్లి, ఆకుతోటపల్లి, ఈశ్వరబోట్లపల్లి, వరికుంట, చలంగారిపల్లెలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ భూములకు పరిహారం చెల్లించారు. నివాస గృహాలకు మాత్రం ఇంతవరకు చెల్లింపులు చేయలేదు. ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా బాధితులకు నిరాశే మిగిలింది. ఎన్నికలు వస్తే చాలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని నాయకులు హమీలిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరికి న్యాయం జరగడంలేదు. వెనుక జలాలు సమీపంలోనే నిల్వ ఉండటంతో కష్టాలతో భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. వీరి గోడును ఎవరు ఆలకించలేదు. గోపవరం మండలం సూరేపల్లి, వడ్డిపాళెం, బోడిచర్లలో నివాసాలకు న్యాయబద్ధంగా పరిహారం చెల్లించలేదని బాధితులు ఆక్రోశిస్తున్నారు. కొన్నేళ్లుగా తమ కన్నీటి వెతలను ఎవరు చెవికెక్కించు కోలేదని వారు వాపోతున్నారు. న్యాయం జరుగుతుందని నిరీక్షణ చేస్తే ఇప్పటికీ ఉలుకు పలుకు లేదని వారంటున్నారు. ఏళ్ల తరబడి నిరీక్షణ చేస్తున్నా కన్నీళ్లు తప్పడం లేదు.

ముంపునకు గురైన అట్లూరు మండలం చింతువాండ్లపల్లె

ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది
సోమశిల జలాశయం ముంపు గ్రామాల్లో రైతుల భూములు, ఇళ్లకు పరిహారం చెల్లింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏ గ్రామంలో ఎంతవరకు నీరు వస్తుందని ఇప్పటికే హద్దులు ఏర్పాటు చేయించాం. ఇంకా డబ్బులు చెల్లించని భూముల్లోకి కూడా వెనుక జలాలు వస్తున్నాయని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో వాస్తవమేమిటని పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. నివాసం ఉంటున్న గృహాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది.
- రమణారెడ్డి, ఎస్‌ఈ, సోమశిల జలాశయం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

కర్షకులకు కన్నీరే
పెనగలూరు మండలం సిరివరం, నరసింగరాజపురం గ్రామ పొలాల్లోకి నీరు వస్తోంది. జలాశయంలో నీటిమట్టాలు పెరిగే కొద్దీ వెనుక జలాలు పంటల్లోకి రావడంతో మునిగి దెబ్బతింటున్నాయని సాగు దారులు వాపోయారు. కర్షకులకు కన్నీరు తప్పడం లేదు. కొన్నేళ్లుగా ముంపు భయం వెంటాడుతూనే ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు, పెన్నపేరూరు, చిన్నకొత్తపల్లి, ఇబ్రహీంపేట, రాచగుడిపల్లె, నరసన్నగారిపల్లెకు చెందిన రైతులు ముంపు పరిహారం ఎప్పుడు ఇస్తారోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా నిరాశ తప్పడం లేదు. పెన్న పేరూరు, తప్పెటవారిపల్లె, వెంకటాయపల్లె, ఇబ్రహీంపేట గ్రామాలను ముంపు బాధిత గ్రామాలుగా ప్రకటించాలని అడుగుతున్నా ఎలాంటి స్పందన లేదు.

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లెకు చెందిన ఆరుగురు రైతులు పుష్కర కాలం కిందట సుమారు 1,200కి పైగా టేకు మొక్కలు నాటారు. అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత మూడేళ్లుగా సోమశిల జలాశయంలో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరంతా పెన్నానదిలో ప్రవహిస్తోంది. టేకు చెట్లలో మూడు నెలలపాటు నీరు నిలిచిన కారణంగా పచ్చదనం తరిగి జీవం కోల్పోయాయి. ఏపుగా పెరిగిన కలప జాతి చెట్లు మొత్తం నిలువునా ఎండిపోయాయి. మూడేళ్లుగా పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం లేదని కర్షకులు కంటతడి పెడుతున్నారు.

చేతికందే పంట నీటిపాలైంది
ఖరీఫ్‌లో 80 సెంట్లలో వరి పంట సాగు చేశా. ఈసారి వాతావరణం అనుకూలింది. పైరు ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే రూ.15 వేలు పెట్టుబడి పెట్టా. ధాన్యం ఇంటికి వస్తే తిండి గింజలకు కొరత ఉండదని ఆశించా. సోమశిల జలాశయంలో నీరు పెరగడంతో చేతికందే పైరు నీటిపాలైంది. పరిహారం చెల్లించి ఆదుకోవాలి.- వెంకటేశ్‌, చాపలవారిపల్లె, నందలూరు మండలం.

నిలువునా ఎండిన టేకు చెట్లు
మాకున్న పొలంలో 15 ఏళ్ల కిందట 195 టేకు మొక్కలు నాటాం. ప్రస్తుతం 40 అడుగులకు పైగా పెరిగాయి. సోమశిల వెనుక జలాలు మూడు నెలల పాటు నిల్వ ఉండటంతో దెబ్బతిని ఎండిపోయాయి. ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.- దండు సుబ్బరాయుడు, రైతు, నరసన్నగారిపల్లె, ఒంటిమిట్ట మండలం

నీరు నిల్వ చేయడంతో అపార నష్టం
మాకున్న భూమిలో 15 ఏళ్ల కిందట 364 టేకు మొక్కలు నాటాం. సోమశిల వెనుక జలాల నిల్వతో పూర్తిగా ఎండిపోయాయి. పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా తిరుగుతున్నా మాకు ఇప్పటికీ ఒక్కరూపాయి ఇవ్వలేదు. అధికారులను అడిగితే త్వరలో వస్తాయంటున్నారు. - తుమ్మలకుంట వెంకటసుబ్బయ్య, రైతు, నరసన్నగారిపల్లె, ఒంటిమిట్ట మండలం

ముంపు భయంతో సాగు చేయలేదు
మాకు రెండెకరాల భూమి ఉంది. సోమశిల వెనుక జలాల ముంపు భయంతో మూడేళ్లుగా పంటలు సాగు చేయడం లేదు. అయిదారేళ్లుగా పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారని అధికారులను అడిగితే త్వరలో ఇస్తామంటున్నారు. మాకు ఇప్పటికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. - మామిడి మదన్‌మోహన్‌రెడ్డి, రైతు, గంగపేరూరు, ఒంటిమిట్ట మండలం.

Read latest Ysr News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని