logo

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు !

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల్లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు.

Published : 25 Sep 2022 03:41 IST

113 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం 

న్యూస్‌టుడే, కడప విద్య

కడప నగరంలోని ఉన్నత పాఠశాల

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల్లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. 3, 4, 5 తరగతుల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల క్రమబద్ధీకరణ తదితర చర్యలతో ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా అధిక సంఖ్యలో మిగులు పోస్టులను చూపింది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చడం, 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రచారం చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 1,800 ఎస్జీటీ పోస్టులను సర్‌ప్లస్‌ పోస్టులుగా గుర్తించారు. వీటిల్లో 1,000 ఖాళీ పోస్టులు కాగా, 800 పోస్టులలో ఉపాధ్యాయులను ప్రభుత్వం వివిధ రూపాల్లో వినియోగించుకోవాల్సిన జాబితాలో ఉంచారు. ప్రస్తుతం ఉపాధ్యాయవర్గాన్ని, నిరుద్యోగులను ఆందోళన కలిగించేవిధంగా ప్రభుత్వం నూతన జీవోలను తీసుకొచ్చింది. వీటితో కొత్త పోస్టుల భర్తీ పక్కనపెట్టి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు రద్దయ్యాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జీవో 155తో ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా 113 సర్‌ప్లస్‌ ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలో జిల్లాలో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య  తగ్గనుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపడతామన్న ఉద్యోగోన్నతుల్లో భాగంగా సర్‌ప్లస్‌ ఎస్జీటీ విభాగంలో ఉన్న 800 మంది ఎస్జీటీలలో స్కూల్‌అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్న పోస్టులనూ ఇదే విధంగా రద్దు చేయనుందని ప్రచారం జరుగుతోంది. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికశాఖ ఆమోదం పొందేందుకు ఈ ఎస్జీటీ పోస్టుల రద్దు జరిగిందని చెబుతున్నారు. ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు భర్తీ చేయాలంటే రెండు లేదా మూడు ఎస్జీటీ పోస్టులు రద్దు చేయాల్సి ఉంటుందని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా సర్‌ప్లస్‌ ఎస్జీటీ పోస్టులు రద్దు చేశారని, కొత్తగా పోస్టులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపే అవకాశాల్లేవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి కడప జిల్లాలో ఒక్క పోస్టూ రద్దు కాదని చెబుతున్నా భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్‌ ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీలో భర్తీచేయడం లేదు. కేంద్రం నిధులతో 2012 నుంచి పార్ట్‌టైం ఉపాధ్యాయుల పేరుతో పాఠశాలల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. జడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 165 మంది, కేజీబీవీల్లో 26 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. తమను రెగ్యులర్‌ చేస్తామనే హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పార్ట్‌ టైం ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో దేవరాజు మాట్లాడుతూ 471 ఎస్జీటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉన్నతీకరిస్తున్నామని, 122 పోస్టులను కన్వర్షన్‌ చేయనున్నామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్‌ ఉపాధ్యాయులు, సర్‌ఫ్లస్‌ ఎస్జీటీ పోస్టుల రద్దు విషయం తమ దృష్టికి రాలేదని వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు