బెదిరించారు... దుర్భాషలాడారు

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బావమరిది ప్రధాన అనుచరుడు సుదర్శన్‌రెడ్డిపై అధికార పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మునీర్‌ రెండో పట్టణ ఠాణా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం...

Updated : 25 Sep 2022 05:34 IST

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బావమరిది అనుచరుడిపై వైకాపా కౌన్సిలర్‌ ఫిర్యాదు

రెండో పట్టణ ఠాణా వద్ద వైకాపా కౌన్సిలర్లు, వారి అనుచరులు

కడప, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బావమరిది ప్రధాన అనుచరుడు సుదర్శన్‌రెడ్డిపై అధికార పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మునీర్‌ రెండో పట్టణ ఠాణా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘నేను శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి వద్ద ఉండగా ఓ నంబరు నుంచి బెదిరింపు కాల్‌ వచ్చింది. ఫోన్‌ లిప్ట్‌ చేసి అన్న చెప్పండంటుండగానే అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. మా అక్కను అసభ్యంగా మాట్లాడతావా’ అంటూ దుర్భాషలాడాడు ‘నువ్వు ఎక్కడ ఉన్నావ్‌ చెప్ఫు.అక్కడికి వచ్చి నిన్ను చంపి..నీ అంతు చూస్తాం..నీకు కూడా నందం సుబ్బయ్య గతే పడుతుంది’ అంటూ సుదర్శన్‌రెడ్డి (క్రికెట్‌ బుకీ) బెదిరించాడని’ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో అతను తన స్నేహితుడు దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డిని కూడా ఇదే విధంగా బెదిరించాడన్నారు. సుదర్శన్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని..నాతో పాటు తన సహచర కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. ప్రధానంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బావమరిది పాతకోట బంగారు మునిరెడ్డి అండతో బెదిరింపులకు పాల్పడుతున్న సుదర్శన్‌రెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిలర్‌ మునీర్‌కు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ వర్గీయులు ప్రొద్దుటూరు పురపాలక వైస్‌ ఛైర్మన్‌ ఖాజా, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లి సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, అయిదో వార్డు కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్‌ వైఎస్‌ మహ్మద్‌గౌస్‌, ఎమ్మెల్సీ సోదరుడు వెంకటప్రసాదు, దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. కౌన్సిలర్‌ ఫిర్యాదు చేసిన కొద్ది సేపటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చెందిన వర్గీయులు స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఐలు ఇబ్రహీం, రాజారెడ్డి, నారాయణ యాదవ్‌, ఎస్సైలు, సిబ్బంది ఇరు వర్గాలను చెదరకొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని