logo

వారు అడగలేక... వీరు ఆదుకోక!

రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు... రాచరికపు వ్యవస్థ మాత్రం కొనసాగుతోందనడానికి నిదర్శనమే ముదివేడు జలాశయం బాధితుల వేదన. తమ పంట పొలాలు, నివాసం ఉండే గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా నోరు తెరిచి తమకు ఎదురు కానున్న కష్టనష్టాలను చెప్పుకోలేకపోతున్నారు.

Updated : 27 Sep 2022 04:18 IST

శరవేగంగా ముదివేడు జలాశయ నిర్మాణ పనులు

పరిహారమివ్వాలని అడిగితే బాధితులకు బెదిరింపులు

గోడు చెప్పుకోలేని దుస్థితిలో నిర్వాసితులు

- ఈనాడు డిజిటల్‌, కడప

ముదివేడు జలాశయం నిర్మాణ పనులు

రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు... రాచరికపు వ్యవస్థ మాత్రం కొనసాగుతోందనడానికి నిదర్శనమే ముదివేడు జలాశయం బాధితుల వేదన. తమ పంట పొలాలు, నివాసం ఉండే గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా నోరు తెరిచి తమకు ఎదురు కానున్న కష్టనష్టాలను చెప్పుకోలేకపోతున్నారు. తమ గోడు చెప్పుకొంటే ఎలాంటి ఉపద్రవం వస్తుందనే భయంతో వణికిపోతున్నారు. తమ కళ్ల ముందే తమ బతుకు తెరువు కూలిపోతున్నా కన్నీటిపర్యంతమవుతూ మిన్నకుండిపోతున్నారు ఆ అభాగ్యులు.

జలాశయం నిర్మాణంతో 1,044 ఎకరాల సాగు భూములతోపాటు దాదాపు 200 కుటుంబాలున్న కొత్తపల్లె, దిగువ సీతువారిపల్లె, చవటకుంటపల్లె, దిన్నిమీదపల్లె గ్రామాలు మునిగిపోనున్నాయి. సాధారణంగా అభివృద్ధి పనుల్లో భాగంగా భూసేకరణ చేయాల్సి వస్తే ఆయా భూములను గుర్తించడం..వాటి యజమానులకు నోటీసులిచ్చి అనుమతులు తీసుకోవడం...వారికి నష్ట పరిహారం చెల్లించేందుకు సంప్రదింపులతో ఒప్పించడం... నగదు చెల్లించడం తదితర ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ తంతు జరిగిన పక్షంలోనే సంబంధిత భూములను స్వాధీనం చేసుకుని పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఇక్కడ జరగలేదు. ముంపు గ్రామాల స్థానంలో నిర్వాసితులకు మరోచోట నిర్మించాల్సి ఉంది. ఇందుకు పరిహారం చెల్లింపుతో పాటు మరోచోట ఇళ్ల స్థలాల ఎంపిక.. నిర్మాణాలు...మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇంత కసరత్తు చేయకుండానే జలాశయం నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా చేస్తున్నారు.

పథకం తీరిది

తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని పిచ్చలవాండ్లపల్లె వద్ద జలాశయం నిర్మాణం తలపెట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యంతో రూ.759.50 కోట్లతో పనులు చేపట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ నుంచి నీటిని వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ-నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ముదివేడు జలాశయానికి తరలిస్తారు. చక్రాయపేట నుంచి 125.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదివేడు జలాశయాన్ని నింపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రిజర్వాయరు నిర్మాణం తలపెట్టారు.

* పనులు చేపడుతున్న గుత్తేదారు సంస్థ రాష్ట్రంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులది కావడంతో అక్కడి భూ యజమానులు, గ్రామస్థులు నోరు తెరవలేకపోతున్నారు. ఒకరిద్దరు పొరపాటున తెరిచినా... పోలీసుల ద్వారా నోరు నొక్కించారు. ఎవరూ అడగంది...మీరెందుకు అడుగుతున్నారంటూ గదమాయించి భయపెడుతున్నారు. పంట పొలాలు, గ్రామాలు మునిగి పోతున్నా బాధితులు ఇదేమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు.

* వామపక్షాలు ఇటీవల ఒకట్రెండు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసి చేతులు దులుపుకొన్నారు.


సర్వే జరుగుతోంది

ముదివేడు జలాశయానికి సంబంధించిన భూసేకరణకు సర్వే జరుగుతోంది. మునిగిపోనున్న గ్రామాల తరలింపు... ప్రత్యామ్నాయ స్థలాలను చూపించే ప్రక్రియ నడుస్తోంది. ఆర్‌అండ్‌ఆర్‌ కింద బాధితులకు న్యాయం చేస్తాం.

- సురేంద్రరెడ్డి, ఈఈ, హంద్రీ-నీవా ప్రాజెక్టు


భయపెడుతున్నారు

ఇల్లేమో పిచ్చలవాండ్లపల్లెలో ఉంది. వ్యవసాయ బోర్లు కొత్తగా నిర్మిస్తున్నా జలాశయం కింద ఉన్నాయి. పొలాలన్నీ ముంపులోనే ఉన్నాయి. పొలాలు లేకుండా... బోర్లు... ఇల్లు ఉండి ఎలా బతకాలి. మా గోడు చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకొంటే భయపెడుతున్నారు.

- ప్రభాకర్‌రెడ్డి, రైతు, పిచ్చలవాండ్లపల్లె, కురలబలకోట మండలం


అడిగే పరిస్థితి లేదు

జలాశయం నిర్మాణంలో ఉన్నా మునిగిపోనున్న మా భూములు, ఇళ్లకు పరిహారం మాట ఎవరూ ఎత్తడంలేదు. అడిగే పరిస్థితి కూడా లేదు.

- రమణారెడ్డి, బాధిత రైతు, దిగువ సీతువారిపల్లె


కొందరికే పరిహారం

జలాశయం నిర్మాణ పనులు జరిగే చోట మాత్రం ఎకరాకు రూ.40 వేలు వంతున గుత్తేదారు చెల్లించారు. ఇది కూడా అతి కొద్ది మందికి మాత్రమే దక్కింది. ఆ తరువాత పరిహారం వస్తే తీసుకోండని వదిలిపెట్టారు. గట్టిగా అడిగే ధైర్యం మాకు లేకుండా పోతోంది.

- వెంకట రమణారెడ్డి, నిర్వాసితుడు, దిగువ సీతువారిపల్లె   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని