logo

అమ్మో... ఆ 7 కిలోమీటర్లు!

మదనపల్లె-అంగళ్లు రహదారిలో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. నిత్యం భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి. రహదారి అభివృద్ధిపై ఇటు జాతీయ రహదారుల నిర్వహణ విభాగంతో పాటు పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారిపై ప్రతి నిమిషానికి సగటున పగటి

Published : 27 Sep 2022 03:10 IST

ప్రమాదకరంగా మదనపల్లె-అంగళ్లు రహదారి

ట్రాఫిక్‌ సమస్యలతో వాహన చోదకుల అవస్థలు

- ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కురబలకోట

అంగళ్లు-రాయచోటి మార్గంలో అసంపూర్తి పనులు

మదనపల్లె-అంగళ్లు రహదారిలో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. నిత్యం భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి. రహదారి అభివృద్ధిపై ఇటు జాతీయ రహదారుల నిర్వహణ విభాగంతో పాటు పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారిపై ప్రతి నిమిషానికి సగటున పగటి వేళల్లో 66, రాత్రి వేళల్లో 43 వరకు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో భారీ వాహనాలే ఎక్కువ.

* మదనపల్లె వైపు నుంచి అనంతపురం, కదిరి, రాయచోటి, కడప మార్గాల్లో వాహనాలు రాకపోలు సాగిస్తుంటాయి. అంగళ్లు వద్ద అనంతపురం, కడప వైపునకు రెండు మార్గాలు చీలిపోతాయి. ఆ తరువాత పెద్దగా ట్రాఫిక్‌ సమస్య ఉండదు. మదనపల్లె- అంగళ్లు మధ్య మాత్రం రెండు వరుసల రహదారి కావడం, కనీస నిర్వహణ లేకపోవడంతో రహదారికిరువైపులా ముళ్లకంపలు పెరిగిపోయాయి. రహదారి అంచుల్లో వర్షపు నీటితో మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా తయారైంది. అత్యంత ప్రధానమైన రహదారి నిర్వహణ లేకపోవడంతోపాటు కనీస మరమ్మతులు చేపట్టకపోవడం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది.

* మదనపల్లె- అంగళ్లు మధ్య 7 కిలోమీటర్ల రహదారికిరువైపులా పల్లెలు.. నివాసాలు... వాణిజ్య సముదాయాలతో నిత్యం జనం కిటకిటలాడుతుంటారు. దీనికి తోడు కొందరు వాహనాలను రహదారుల పక్కన ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేస్తున్నారు. దీంతో 7 కిలోమీటర్ల రహదారిని దాటేందుకు ఒక్కో సందర్భంలో గంటకుపైగా సమయం పడుతుండడం గమనార్హం. సమయం వృథాతో పాటు గుండె దడదడలాడేలా ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంటోంది. అంగళ్లు నుంచి రాయచోటి వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. సాధారణంగా కేంద్రం నుంచి అందుతున్నందున నిధులు సమస్య లేకపోవడంతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయి. అంగళ్లు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల పొడవునా విస్తరణ పనులు, మురుగు కాలువలు, విభాగినుల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గుత్తేదారు శరవేగంగా పనులు చేయకపోవడమే సమస్యకు ప్రధాన కారణం.

అంగళ్లులో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఇలా...

నాలుగు వరుసల రహదారి నిర్మిస్తాం

మదనపల్లె నుంచి అంగళ్లు వరకు నూతనంగా బైపాస్‌ మార్గం నిర్మాణం నాలుగు వరుసలతో ఆరు కిలోమీటర్ల వరకు చేపడతాం. భూసేకరణ ఆలస్యం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఒకట్రెండు నెలల్లో పనులు ప్రారంభించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.విస్తరణతో పాటు మురుగకాలువలు, విభాగినుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.  - రాజేంద్రప్రసాద్‌రెడ్డి, డీఈ, జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని