logo

ప్రకాశించని పర్యాటకం!

పర్యాటకులకు స్వర్గధామంగా రాయలసీమ నడిగడ్డ కీర్తిని సొంతం చేసుకుంది. ఇంతటి విభిన్నమైన, వైవిధ్యభరిత ప్రాంతం అభివృద్ధిపై పాలకులు శీతకన్ను వేశారు. ప్రగతి బాటలకు శ్రీకారం చుట్టాలని రూపొందించిన ప్రణాళికలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దర్శనీయ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు,

Updated : 27 Sep 2022 05:17 IST

కనీస మౌలిక సదుయాపాలు కరవు

వినియోగానికి దూరంగా భవనాలు

కాగితాల్లోనే పనుల ప్రతిపాదనలు

- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట, సిద్దవటం, లింగాల, రాజంపేట గ్రామీణ

పర్యాటకులకు స్వర్గధామంగా రాయలసీమ నడిగడ్డ కీర్తిని సొంతం చేసుకుంది. ఇంతటి విభిన్నమైన, వైవిధ్యభరిత ప్రాంతం అభివృద్ధిపై పాలకులు శీతకన్ను వేశారు. ప్రగతి బాటలకు శ్రీకారం చుట్టాలని రూపొందించిన ప్రణాళికలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దర్శనీయ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలపై ప్రత్యేక కథనం.

కడప-రేణిగుంట జాతీయ రహదారిపై ఒంటిమిట్ట చెరువులో జల షికారుకు ఆరేళ్ల కిందట ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాటు చేసిన సూచిక. అప్పట్లో రెండు పడవలు తెప్పించినా ఇంత వరకు జలవిహారం ఊసే లేదు

ఒంటిమిట్ట కోదండరామాలయం దర్శనానికొచ్చే భక్తులకు జల షికారు భాగ్యం కల్పించాలని ఆరేళ్ల కిందట ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పలు నిర్మాణాలు, వసతుల కల్పనకు రూ.33 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

* ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలో సోమశిల వెనుక జలాల్లో ఏకో ప్రాజెక్టు చేపట్టాలని పుష్కర కాలం కిందట కిందట అప్పటి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక్కడ చేపట్టనున్న పనులకు 2010లో శంకుస్థాపన సైతం చేశారు. వెనక జలాలున్న 22 వేల హెక్టార్లలో పడవ షికారుకు ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు.

* మైలవరం, బ్రహ్మంసాగర్‌లో పడవ ప్రయాణానికి బోట్లు తెప్పించారు. కరోనా వ్యాప్తితో రెండేళ్ల కిందట ఆపేశారు. తిరిగి పునరుద్ధరించలేదు.

* సిద్దవటం కోట వద్ద ఆరేళ్ల కిందట రూ.58 లక్షలతో నిర్మించిన పర్యాటక భవనాలను వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు.

* నందలూరు బౌద్ధరామాలు వద్ద, రాజంపేట మండలం గుండ్లూరు, అత్తిరాల, పీబీఆర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసినా నిర్వహణను గాలికొదిలేశారు.

* లంకమల, పెనుళిల అభయారణ్యాలతోపాటు వీటి పరిధిలోని శైవ క్షేత్రాలు, శేషాచలం, నల్లమల, పాలకొండలు, వెలిగొండలు, తూర్పు కొండలను సందర్శించే యాత్రికులకు కనీస సౌకర్యాల్లేవు.

* ప్రముఖ పర్యాటక కేంద్రాలైన గండికోట, హార్సిలీహిల్స్‌తోపాటు ప్రముఖ దేవాలయాలు, దర్శనీయ ప్రాంతాల్లో చాలాచోట్ల సందర్శకుల విడిదికి అనువైన గదులు, తాగేందుకు రక్షిత జలాలు, మరుగు వసతుల్లేవు. నిధుల కొరతతో రూపొందించిన ప్రణాళికలు పట్టాలెక్కలేదు. ఫలితంగా అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఇటీవల యాత్రికుల కోసం బస్సు యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవునికడప, పుష్పగిరి, ఒంటిమిట్ట కోదండరామాలయం, సిద్దవటం కోటకు తీసుకెళ్లేలా అనుమతిచ్చారు. ఇదొక్కటే ప్రస్తుతం యాత్రికులకు ఊరటనిచ్చే అంశం.

పెంచికల బసిరెడ్డి జలాశయం వద్ద దెబ్బతిన్న కుటీరం


వసతులు కల్పిస్తాం : దర్శనీయ కేంద్రాల్లో పర్యాటకులకు వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాం. నిధులివ్వాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నత స్థాయి నుంచి అనుమతులు రాగానే యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతపై విస్తృత ప్రచారం చేస్తాం.

- రామ్‌కుమార్‌, జిల్లా అధికారి, పర్యాటకశాఖ, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని