logo

అధికారుల ఒత్తిళ్లు... అమ్మకానికి ఇంటి స్థలాలు!

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్థలాలను వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు.

Published : 03 Oct 2022 02:19 IST

 ప్రభుత్వం  ఇస్తున్న సాయం చాలడం లేదంటున్న లబ్ధిదారులు

 ఇదీ జగనన్న కాలనీల పరిస్థితి

కడప నగర శివారులోని జగనన్న కాలనీ

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్థలాలను వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ మంజూరైనప్పటికీ ఇంకనూ నిర్మాణం మొదలుపెట్టని వారు వెంటనే ప్రారంభించాలని లబ్ధిదారులను అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు మండల తహసీల్దారు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల కాల వ్యవధిలో నిర్మాణం ప్రారంభించని పక్షంలో స్థలంతో పాటు ఇళ్లను రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. వాట్సాప్‌ సందేశాలూ పంపుతున్నారు.

- ఈనాడు డిజిటల్‌, కడప

జిల్లాలో రాజంపేట గ్రామీణ మండలానికి 14 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. మండలంలో మూడు లేఅవుట్లు ఏర్పాటు చేయగా మిట్టమీదపల్లె గ్రామం వద్ద రెండు వేల మందికి కేటాయించారు. రాజంపేట పట్టణంలోని పేదలకు అక్కడ స్థలాలు మంజూరు చేశారు. పట్టణానికి సుదూరంలోని లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు సుముఖంగా లేరు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే ఒత్తిళ్లను తట్టుకోలేక పలువురు స్వచ్ఛందంగా స్థలాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో పలు చోట్ల ఉంది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లబ్ధిదారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు.

* ఇళ్ల స్థలాలకు మంచి ధర పలికే నగర, పట్టణ ప్రాంతాలకు దగ్గర్లో లబ్ధిదారులు స్థలాలను అమ్మకానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎలాంటి రాతపత్రాలూ లేకుండా మాట మీదనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరగడం, ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షల ఆర్థిక సాయం చాలకపోవడంతో కొంతమంది స్థలాలను అమ్ముకుంటున్నారు. ఇంటి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ఒత్తిడి కూడా అమ్మకానికి మరో కారణంగా నిలుస్తోంది. అమ్మకం జరిగినా అధికారులకు అనుమానం రాకుండా లబ్ధిదారులే ముందుండి అన్ని పనులూ చేస్తున్నారు. పేదల పరిస్థితిని ఆసరాగా తీసుకుని జగనన్న కాలనీలపై స్థిరాస్తి వ్యాపారులు గద్దల్లా వాలుతున్నారు. లబ్ధిదారుల నుంచి చౌకగా స్థలాలను కొనుగోలు చేసి దానిపై మరింత లాభం పొందేలా ఇతరులకు కట్టబెడుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయి.. ప్రభుత్వ ఆర్థిక సాయం అందే వరకు లబ్ధిదారులు అందుబాటులో ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. నిర్మాణం పూర్తయ్యాక అద్దెకు ఇచ్చినట్లుగా ఉండేలా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కడప నగరం, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, మదనపల్లె పట్టణ సమీపాల్లో ఇలాంటి ఒప్పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సెంటు స్థలాన్ని రూ.2 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

ప్రోత్సహించడానికి నోటీసులిస్తున్నాం

లబ్ధిదారులను ప్రోత్సహించడంలో భాగంగానే నోటీసులు జారీ చేసి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నాం. నిర్మాణాలు పూర్తిచేసుకుంటే పేదలకే ఉపయుక్తంగా ఉంటుంది. సదుద్దేశంతోనే చర్యలు చేపట్టాం. ఇంత వరకు ఇళ్ల పట్టాలు ఎవరివీ రద్దు చేయలేదు.

- వెంకటేశ్వర్లు, తహసీల్దారు, ముద్దనూరు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని