logo

శేషాచలం.. జీవవైవిధ్యానికి నిలయం

ఉమ్మడి కడప జిల్లాలో 5,55,592 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. పులులు, చిరుత, కణుజు, పొడదుప్పి, కొండ గొర్రెలు, కృష్ణజింక, ఎలుగుబంట్లు, మనుబోతులు, కొండముచ్చులు, హైనా, ఏనుగులు, అడవి పందులు, పునుగుపిల్లులు, రేచుకుక్కలు, అలువలు, కుందేళ్లు, మరికొన్ని వన్యప్రాణులు ఉన్నాయి.

Updated : 05 Oct 2022 06:14 IST

ఉమ్మడి కడప జిల్లాలో అరుదైన జీవజాలం

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం రేపు

న్యూస్‌టుడే, సిద్దవటం

ఉమ్మడి కడప జిల్లా అడవులు జీవవైవిధ్యానికి నిలయం. సాధారణ, అరుదైన వన్యప్రాణులు మనకు ప్రత్యేకం. కరవు, ఇతర ప్రమాదాల కారణంగా వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించి వాటిని సంరక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ నెల 6న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

శేషాచలం అడవుల్లో ఏనుగు

మ్మడి కడప జిల్లాలో 5,55,592 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. పులులు, చిరుత, కణుజు, పొడదుప్పి, కొండ గొర్రెలు, కృష్ణజింక, ఎలుగుబంట్లు, మనుబోతులు, కొండముచ్చులు, హైనా, ఏనుగులు, అడవి పందులు, పునుగుపిల్లులు, రేచుకుక్కలు, అలువలు, కుందేళ్లు, మరికొన్ని వన్యప్రాణులు ఉన్నాయి. అరుదైనవి హనీబాడ్జర్‌, ఆలువ, దేవాంగపిల్లి, గడ్డిజింక, రాక్షససాలీడు, తోడేళ్లు, నక్కలు, గద్దలు, ఇలా మొత్తం 21 రకాల వన్యప్రాణులు అడవుల్లో ఉన్నాయి. గజరాజులు, దేవాంగపిల్లి, పులులు, చిరుతలు, కృష్ణజింక, హనీబాడ్జర్‌, గడ్డిజింకలు సంచారంతో లంకమల, శేషాచలం అడవులు ప్రత్యేకతను చాటుకున్నాయి.

అరుదైన జంతువు హనీబాడ్జర్‌

పెరిగిన పులుల సంచారం
గత కొన్నేళ్లగా జిల్లాలో పులుల సంచారం కనిపిస్తోంది. వీటి గణనకు అధికారులు ఆధునిక కెమెరాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్దవటం, బద్వేలు, పోరుమామిళ్ల, వనిపెంట అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి. తాజాగా  పోరుమామిళ్ల, వనిపెంట అటవీ ప్రాంతంలో ఆరు పులులు ఉన్నట్లు గణాంకాల ద్వారా వెలుగులోకి వచ్చింది. పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణ నిమిత్తం లంకమలలో 10,806 హెక్టార్లను టైగర్‌ కారిడార్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నల్లమల నుంచి లంకమలకు సర్వే పనులు చేపట్టారు.

కొరవడిన రక్షణ
వేసవి వచ్చిదంటే అటవీ ప్రాంతంలో వన సంపద, నీటి కుంటలు ఎండిపోతుండడంతో వాటికి నీరు, ఆహారం కొరత తలెత్తుతోంది. దాహం తీర్చుకోవడానికి అటవీ శివారులో ఉన్న గ్రామాల్లోకి వస్తున్నాయి. పొలాల రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు తీగలకు వన్యప్రాణులు తగులుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. మరికొన్ని కుక్కల దాడికి గురై మృతి చెందుతుండగా, ఇంకొన్ని రహదారి దాటుతుండగా, వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి.

సంరక్షణకు ప్రత్యేక చర్యలు
- పి.వి.సందీప్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, వైయస్‌ఆర్‌ జిల్లా

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 8వ తేదీ వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే పనులు చేపడతాం. వన్యప్రాణులు సమీప గ్రామాలకు వెళ్లకుండా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గడ్డి భూములు, నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పులుల సంరక్షణకు కారిడార్‌ ఏర్పాటు చేయనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని