logo

Super Star Krishna: ఎన్నికల సంగ్రామంలో సూపర్‌స్టార్‌!

ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్‌ నటశేఖర కృష్ణకు జిల్లాతో, అందులోనూ బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పట్టణాలతోపాటు  ఒంటిమిట్టతో ప్రత్యేక  అనుబంధం ఉంది.

Updated : 16 Nov 2022 09:32 IST

కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారానికి కృష్ణ రాక

న్యూస్‌టుడే, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు పట్టణం, ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట: ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్‌ నటశేఖర కృష్ణకు జిల్లాతో, అందులోనూ బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పట్టణాలతోపాటు  ఒంటిమిట్టతో ప్రత్యేక  అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కృష్ణ తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకుని జిల్లావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండూరు ప్రభావతమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 1983, ఏప్రిల్‌లో మాధవరంలో నిర్వహించిన సభకు కృష్ణ హాజరయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు ఆయన సతీమణి విజయనిర్మల, ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిరుపతి నుంచి రాజంపేటకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మంటపంపల్లెలో ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి మాధవరానికి విచ్చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి దూకుడుగా తరలివచ్చి సమావేశాన్ని అడ్డుకోవాలని అల్లరి సృష్టించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి మధ్యలోనే కృష్ణతోపాటు ఇతర నటులు, కీలక నేతలను సురక్షితంగా పంపించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1984లో జరిగిన కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సినీనటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కందుల ఓబులరెడ్డికి మద్దతుగా కడప నుంచి మైదుకూరు వరకు పర్యటించారు. ఇందులో భాగంగా కడప పురపాలక మైదానం, మైదుకూరు ఆర్టీసీ బస్టాండు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఓపెన్‌టాప్‌ జీపులో ప్రచారం నిర్వహించారు.

సినీనటుడు కృష్ణతో ప్రొద్దుటూరు అభిమానులు

వారిది 60 ఏళ్ల అనుబంధం: జిల్లాకు చెందిన దివంగత హాస్యనటుడు బస్వరాజు పద్మనాభం కుటుంబంతో కృష్ణ కుటుంబానికి 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ సందర్భంగా పద్మనాభం సోదరుడు బస్వరాజు ప్రసాదరావు కృష్ణ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ‘న్యూస్‌టుడే’కు వివరించారు. తన సోదరుడు నటించిన  ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణ అతిథి నటుడిగా పాత్ర పోషిస్తే తాను సహాయ నటుడిగా తీసిన చిత్ర సన్నివేశాలను గుర్తుచేసుకుని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలు తీసి నష్టం వచ్చిన సమయంలో తమను ‘నేనున్నా... భయపడొద్దు సినిమాలను తీయండని అన్నకు అండగా ఉండి ఆర్థికంగా సాయం అందించిన సహృదయులని కొనియాడారు.

ఆ క్షణాలు మరపురానివి: సేవ్‌ ట్రీ, సేవ్‌ ప్లాంట్‌ ప్రాజెక్టుపై తాను గీసిన చిత్రరాజాన్ని ప్రొద్దుటూరుకు చెందిన చిత్రలేఖ కళాకారిణి కొడవలూరు ప్రసన్న ఈ ఏడాది జూన్‌ 22వ తేదీన సినీ నటుడు కృష్ణకు అందజేశారు. తనను ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించిన నటశేఖర కృష్ణ ఇకలేరని తెలిసి ఆ చిన్నారి ఆవేదన చెందారు. ఆయన తనతో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ‘న్యూస్‌టుడే’కు మంగళవారం తెలిపారు. తన ప్రాజెక్టును వివరించి తానే స్వయంగా గీసిన చిత్రాన్ని ఆయనకు బహుకరించడం చాలా సంతోషం కలిగిందన్నారు. ఆ క్షణాలు మరపురానివన్నారు.

ఈ ఏడాది జూన్‌ 22న కృష్ణకు చిత్రాన్ని బహూకరిస్తున్న చిత్ర కళాకారిణి ప్రసన్న

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని