logo

ముఖ్యమంత్రి గారు.. వరాలు గుర్తుచేసుకోరూ?

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు... అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటినీ విస్మరించారు.

Published : 30 Nov 2022 04:09 IST

ప్రతిపక్షనేత, ముఖ్యమంత్రి హోదాల్లో వాగ్దానాలు
మూడున్నరేళ్ల పాలనలో కార్యరూపం దాల్చని పనులు
మదనపల్లెలో నేడు సీఎం పర్యటనపై గంపెడాశలు

కడప-బెంగళూరు మార్గంలో పెండ్లిమర్రి వద్ద నిలిచిపోయిన రైల్వే పనులు

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు... అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటినీ విస్మరించారు. జిల్లాలో సుదీర్ఘ కాలంపాటు పాదయాత్ర చేసిన సమయంలో తాము అధికారంలోకి రాగానే జిల్లా స్వరూపాన్నే మార్చేస్తానని, పిలిస్తే పలికే కరవును పారదోలతానని హామీలు గుప్పించారు. అధికారంలోకొచ్చి మూడున్నరేళ్లు గడిచిపోగా, ఇంత వరకు ఏ ఒక్క హామీ కార్యరూపం దాల్చలేదు. వివిధ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడంలేదు. మదనపల్లెలో బుధవారం ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ప్రజల సమస్యలు, ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి హోదాల్లో ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రత్యేక కథనం.

ఈనాడు డిజిటల్‌, కడప

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుకు ఇంతవరకు మోక్షం కలగలేదు. కడప నుంచి పెండ్లిమర్రి, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, వాల్మీకిపురం, మదనపల్లె మీదుగా కర్ణాటకలోని మదగట్ట, ముళబాగల్‌ మీదుగా కోలారు- బంగారుపేట రైల్వేలైన్‌లో కలిసే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. వైకాపా ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసి కడప, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బలో కలిసేవిధంగా రాష్ట్రం ప్రతిపాదించింది. దీంతో అన్నమయ్య జిల్లాలో రైలు మార్గానికి గండికొట్టినట్లయింది.

* ప్రతిపక్ష నేత హోదాలో మదనపల్లెలో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నీరుగట్టువారిపల్లె చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులు తయారు చేసే వస్త్రాలకు బ్రాండ్‌ ఇమేజీ తీసుకొస్తామని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కఠిన నిబంధనలతో నేతన్న నేస్తం పథకానికి చాలామంది అర్హత కోల్పోయారు.

* మదనపల్లెకు వైద్య కళాశాల మంజూరు చేసినా భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రానున్న రెండేళ్లకుగానీ పనులు పూర్తవుతాయనే నమ్మకం లేదు.

* గతేడాది నవంబరులో వచ్చిన వరదలకు అన్నమయ్య, పింఛ జలాశయాలు కొట్టుకుపోయి ఏడాది దాటినప్పటికీ నిర్మాణ పరంగా ప్రతిపాదనలు ఆమోదం మినహా ఎలాంటి అడుగు ముందుకుపడలేదు. వరద బాధిత ప్రాంతాలైన రాజంపేట మండలంలోని బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ హామీ అమలులో తీవ్ర తాత్సారం జరుగుతోంది. పలు గ్రామాలు, బాధితులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఆసరా లభించడంలేదు.

* పంటల బీమా మంజూరులో కఠిన ఆంక్షల కారణంగా ఉద్యాన ఆధారిత ప్రాంతమైన అన్నమయ్య జిల్లా తీవ్రంగా నష్టపోతోంది. వాతావరణ ఆధారిత నివేదిక ఆధారంగా మాత్రమే బీమా మంజూరు ఉంటుందని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేయడంతో అన్నదాతలకు మింగుడుపడడంలేదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటామన్న హామీని విస్మరించి మండలంగా ప్రకటించారు.

* గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పెండింగ్‌ బిల్లులతోపాటు కేంద్రం నిధుల మళ్లింపుతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. చాలా చోట్ల కంకర పరిచేసిన రహదారుల్లో రాకపోకలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భూసేకరణలో జాప్యం కారణంగా జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో ఎలాంటి ప్రగతి లేదు. భూయజమానులకు పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తికాలేదు.

* జిల్లాలో 1,226 పశువులు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.3.50 కోట్ల పరిహారం మంజూరుకు గత 31 నెలలుగా పాడిరైతులు ఎదురుచూస్తున్నారు.

* జిల్లాలో ఇసుక దందా, ప్రభుత్వ భూముల కబ్జా, మట్టి అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నాయి. అధికార పార్టీ వ్యక్తులే స్వాహారాయుళ్లు కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.ః

* జిల్లాలో అత్యధికంగా విస్తీర్ణంలో సాగవుతున్న టమోట పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదు. రైతులను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధితో ఆర్థికసాయం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. రాయచోటి, మదనపల్లెలో ప్రాసెసింగ్‌ యూనిట్లుకు రాయచోటిలో శంకుస్థాపన చేయగా, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

* పెండింగ్‌ బిల్లుల కారణంగా ప్రభుత్వం ప్రాధాన్య భవనాలుగా పరిగణిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులు చాలాచోట్ల నిలిచిపోయాయి.

* కొత్తగా అవతరించిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరత తీవ్రంగా ఉంది. అధికారులు, సిబ్బందికి కనీసం కుర్చీలు కూడా లేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో రూ.236 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు బిల్లుల గండం పట్టుకుంది. 

* మదనపల్లె పట్టణంలో అవుటర్‌ రింగురోడ్డు, సమ్మర్‌స్టోరేజీ నిర్మాణ పనులతోపాటు వైద్య సేవలు మెరుగుపరచడం తదితర అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.


రాయచోటి వద్ద అసంపూర్తిగా హంద్రీ- నీవా కాలువ నిర్మాణం

* హంద్రీ- నీవా సుజల స్రవంతి పథకం అన్నమయ్య జిల్లా రైతులకు కలగానే మిగిలిపోయింది. కరవుతో అల్లాడే జిల్లాకు సంజీవని లాంటి ఈ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిపోయింది. వాటర్‌గ్రిడ్‌ పథకం కింద గండికోట జలాశయం నుంచి నీటిని మళ్లించి అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులకు నీరందించడానికి రూ.4,373.93 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. అడవిపల్లి జలాశయాన్ని నింపి తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తామన్న ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని