logo

సీఎంకు తెలియకుండానే ఇసుక దోపిడీ జరుగుతోందా: తెదేపా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు తెలియకుండా ఇసుక దోపిడీ జరుగుతుందా అని తెదేపా ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆరోపించారు.

Updated : 30 Nov 2022 05:53 IST

జిల్లా ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర
ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, పక్కన నాయకులు పుట్టా సుధాకర్‌యాదవ్‌, హరిప్రసాద్‌ తదితరులు

చాపాడు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు తెలియకుండా ఇసుక దోపిడీ జరుగుతుందా అని తెదేపా ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆరోపించారు. చాపాడు మండలం వెదురూరు ఇసుక రేవును మంగళవారం ఆయన తెదేపా మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుత్తా విలేకరులతో మాట్లాడారు. వెదురూరు రెవెన్యూ పరిధిలోని పెన్నా నదిలో 48 వేల క్యూబిక్‌ మీటర్లు ఏడాదిలో తరలించాలని ఓ గుత్తేదారుకు ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పరిధులు దాటి, లక్షల క్యూబిక్‌ మీటర్లు తరలించారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జల ప్రవాహమున్నప్పుడు ఇసుక తోడవద్దని నిబంధనలున్నా పట్టించుకోవడంలేదన్నారు. భారీ వాహనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భూములు కోతకు గురవుతున్నాయని, పశువులకు గ్రాసం కొరత తలెత్తుతోందని రైతులు ఆవేదన చెందు తుండటంతో తాము వచ్చామన్నారు. తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నామని, చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం పుట్టా మాట్లాడుతూ క్వారీలో సమస్యలు వచ్చినప్పుడు కమిటీలు పరిష్కరించాల్సి ఉండగా, అవి పనిచేయడం లేదన్నారు. కమిటీలో డీఎస్పీ, ఆర్డీవో, ఏడీ నిత్యం తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. ఎస్‌ఈబీ నిద్రపోతుందన్నారు. ట్రాక్టరు చోదకులకు రాయల్టీ స్లిప్పులూ నకిలీవి ఇస్తున్నారని ఆరోపించారు. ఏటి పొరంబోకు భూముల్లో సాగునీటి గొట్టాలన్నీ ధ్వంసం చేశారని, అక్రమంగా తరలించిన ఇసుకను, వాహనాలతోపాటు యంత్రాలను సీజ్‌ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోకపోతే మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అనంతరం వారు ఎస్పీ, భూగర్భ గనుల శాఖ ఏడీతో చరవాణిలో మాట్లాడారు. జియోట్యాగ్‌ ప్రకారం ఏ ప్రాంతంలో, ఎంత లోతు ఇసుక తీశారని ఏడీని ప్రశ్నించారు. కమలాపురం పరిధిలో ఇసుక తోడుతున్నారని ఇపరాపురం రైతులు అడ్డుకుంటే చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని ఎస్పీని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని