logo

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌

జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.

Published : 30 Nov 2022 04:09 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన జేసీ
సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్‌, అధికారులు

జిల్లా సచివాలయం, పులివెందుల, న్యూస్‌టుడే: జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎస్పీ అన్బురాజన్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. పర్యటన ప్రాంతాల్లో ప్రోటో కాల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేపట్టి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశిబిరాలు, సహాయక కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో జేసీ సాయికాంత్‌వర్మ, కమిషనర్‌ సూర్య సాయిప్రవీణ్‌చంద్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా, డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూలు ఇలా... ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరు 2వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. గంటపాటు అక్కడే స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 11.30 గంటలకు హెలీకాఫ్టరులో లింగాల మండలానికి బయలుదేరుతారు. 11.50 గంటలకు పార్నపల్లెకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.55 గంటలకు సీబీఆర్‌ జలాశయానికి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పడవ షికారును ప్రారంభిస్తారు. అనంతరం 12.40 గంటల ప్రాంతంలో పార్నపల్లెలోని వైఎస్‌ఆర్‌ లేక్‌వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పార్నపల్లెలోని హెలీప్యాడ్‌కు చేరుకుని ఇడుపులపాయకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని అతిథిగృహానికి చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు 3వ తేదీ ఉదయం 8.40 గంటలకు అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుని రోడ్డుమార్గంలో కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్‌కు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 9.50 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 10.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి బయలుదేరుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని