logo

నిధులున్నా... నీరసం

ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్‌ వ్యాధులు విజృంభించి పేద, మధ్యతరగతి వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Updated : 30 Nov 2022 05:54 IST

ప్రభుత్వాసుత్రులకు రూ.144.50 లక్షల కేటాయింపు
సకాలంలో ఖర్చుచేయని అధికారులు

వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లి పీహెచ్‌సీకి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు దశల్లో

హెచ్‌డీఎస్‌ పద్దు రూ.1.75 లక్షలు  విడుదలైంది. ఇప్పటికీ రూపాయి ఖర్చు పెట్టలేదు.

ఒంటిమిట్ట, పులివెందుల, కమలాపురం, న్యూస్‌టుడే : ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్‌ వ్యాధులు విజృంభించి పేద, మధ్యతరగతి వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్నటివరకు ప్రభుత్వాసుపత్రుల నిర్వహణకు కాసులు కష్టం వెంటాడింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆర్థిక పద్దు అందినా సకాలంలో ఖర్చు చేయలని దైన్యం నెలకొంది. నిధులున్నా నీరసం తప్పడం లేదు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 50 ఉన్నాయి. ప్రొద్దుటూరులో జిల్లా వైద్యాలయం, పులివెందుల, జమ్మలమడుగులో ప్రాంతీయ వైద్యశాలలు, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, చెన్నూరు, పోరుమామిళ్ల, వేంపల్లెలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులను (హెచ్‌డీఎస్‌ఎఫ్‌) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల్లో కేటాయించారు. తొలిదశలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఒక్కో పీహెచ్‌సీకి రూ.25 వేల చొప్పున రూ.12.50 లక్షలు ఇచ్చారు. జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులకు రూ.లక్ష లెక్కన రూ.10 లక్షలు మంజూరు చేశారు. తర్వాత ఆగస్టు 13న ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.50 లక్షల చొప్పున రూ.75 లక్షలకు ఆమోదం తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రూ.9 లక్షలు, వైద్య విధాన పరిషత్తులో ఉన్న మిగతా వైద్యాలయాలకు రూ.4 లక్షలు చొప్పున విడుదల చేశారు. రెండు దశల్లో కలిపి రూ.144.50 లక్షలకు అనుమతిచ్చారు. ఇప్పటికీ చాలా ఆసుపత్రుల్లో వినియోగంపై అలసత్వం చూపుతున్నారు.

నిధులొచ్చినా అదే తీరు: రోగులకు కావాల్సిన అత్యవసర ఔషధాలను కొనుగోలు చేయవచ్చు. తాగునీటి వసతి, విద్యుత్తు దీపాలు, ఫ్యాన్ల మరమ్మతులకు ఆసుపత్రి సలహా మండలి కమిటీ ప్రతినిధులు సమావేశమై ఏమి కావాలో చర్చించి తీర్మానం చేసిన తర్వాత నిధులను వెచ్చించాలి. చాలా ప్రభుత్వాసుపత్రుల్లో సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. కారణంగా నిధులొచ్చినా ఖర్చు చేయలేని దైన్యం నెలకొంది. వినియోగంపై ఉన్నత స్థాయి నుంచి మార్గనిర్దేశాలు జారీ చేసినా కదలిక లేదు. ఒంటిమిట్ట పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు రాగా రూ.25 వేలు వాడారు. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలో రూ.1.75 లక్షలకు రూ.52 వేలు వినియోగించారు. కమలాపురం మండలం పెద్దచెప్పలి పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు రాగా రూపాయి వెచ్చించలేదు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొంది.

ఆసుపత్రి అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చు

ఆసుపత్రి అవసరాలకు హెచ్‌డీఎస్‌ నిధులు ఖర్చు చేసుకోవాలి. వైద్యాలయాలకు కేటాయించిన పద్దును ఎందుకు ఖర్చు చేయలేదో క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తాం. పీహెచ్‌సీలకు మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకునేలా వైద్యాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.

డాక్టరు ఉమామహేశ్వర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కడప.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని