logo

మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన నేడు

మదనపల్లెకు నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.

Published : 30 Nov 2022 04:09 IST

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు

సభావేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష, జేసీ తమీమ్‌ అన్సారియా, తదితరులు

మదనపల్లె పట్టణం, మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లెకు నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో నాలుగో విడత విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో 11 గంటలకు మదనపల్లెలోని  హెలీప్యాడ్‌కు చేరుకుని 11.10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గంలో టిప్పుసుల్తాన్‌ మైదానంలోని సభాస్థలికి 11.30 గంటలకు చేరుకుని 11.55 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లబ్ధిదారులతో మాట్లాడిన తరువాత 12.40 గంటల వరకు ప్రసంగిస్తారు. అనంతరం 12.45 గంటలకు నాలుగో విడత విద్యాదీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెలీప్యాడ్‌ వద్దకు 12.55 గంటలకు చేరుకుని 15 నిమిషాలపాటు స్థానిక నాయకులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మదనపల్లె నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 3.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు. 

పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

సభావేదిక పరిశీలన: టిప్పుసుల్తాన్‌ మైదానంలో ముఖ్యమంత్రి బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ గిరీష పరిశీలించారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభావేదికను ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘురామ్‌, జేసీ తమీమ్‌ అన్సారియాతో కలిసి పరిశీలించి వేదిక ఎత్తు తక్కువగా ఉండటంతో దాన్ని తొలగించి ఎత్తు పెంచి తయారు చేశారు.

1,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ముఖ్యమంత్రి పర్యటనకు 1,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. మదనపల్లెలో మంగళవారం ఉదయం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వహించాలో నిర్ణయించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి తితిదే, ఆర్యవైశ్య కల్యాణ మండపాల్లో బస ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం కాన్వాయ్‌ ట్రైల్‌ రన్‌ నిర్వహించారు.

పర్యటనకు 755 బస్సులు: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 755 బస్సులను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ డివిజనల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ ఇబ్రహీం, మదనపల్లె-1 డిపో డీఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. డీఆర్‌డీఏ మహిళలకు 200 బస్సులు, ఇతర సాధారణ జనం కోసం 555 బస్సులను కేటాయించామన్నారు. బస్సులకు సుమారు 2 వేల మంది సిబ్బందిని నియమించామని, బస్సుల నిర్వహణకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని