logo

తొలిసారిగా పర్యటన పాత హామీలే ప్రస్తావన

మదనపల్లె పురపాలక సంఘానికి రూ.38 కోట్లు ఇచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ములకలచెరువు- మదనపల్లె రహదారికి రూ.400 కోట్లు

Published : 01 Dec 2022 05:31 IST

మదనపల్లెలో సీఎం జగన్‌  పర్యటన
‘జగనన్న విద్యాదీవెన’ నిధుల విడుదల
మదనపల్లె పట్టణానికి కాస్త ఊరడింపు

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటి కేంద్రంగా కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి వరాల కోసం ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకోగా... పాత పాటే పాడుతూ... గతంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించారు. మదనపల్లెకు ఇప్పటికే వైద్య కళాశాలను మంజూరు చేశామని, ఈ నెలలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. భవనాల నిర్మాణం వేగవంతానికి చేసే కృషిని వివరించలేదు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు తాగు నీటి సమస్య పరిష్కారానికి గండికోట నుంచి పైపులైను ద్వారా నీటిని తీసుకువచ్చే వాటర్‌గ్రిడ్‌ పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకాన్ని రూ.1,800 కోట్లతో చేపడుతున్నామని, ఇందులో రూ.400 కోట్లు మదనపల్లెకు ఖర్చు చేస్తున్నామని పాత విషయాన్నే పునరుద్ఘాటించారు. పథకం ఎప్పటిలోగా పూర్తిచేస్తామన్నది స్పష్టంగా చెప్పలేదు.

న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌, కడప,

న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, నేరవార్తలు, గ్రామీణ, అర్బన్‌: మదనపల్లె పురపాలక సంఘానికి రూ.38 కోట్లు ఇచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ములకలచెరువు- మదనపల్లె రహదారికి రూ.400 కోట్లు, మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారికి రూ.1,600 కోట్లు మంజూరు చేయించినట్లు పాత పనులను ప్రస్తావించారు. కేంద్ర నిధులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. మీ అందరి కోరిక మేరకు మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేశామని, గతంలో తీసుకున్న నిర్ణయాన్నే తిరిగి గుర్తు చేశారు. మదనపల్లెలోని టిప్పుసుల్తాన్‌ మసీదుకు రూ.5 కోట్లు, పురపాలక సంఘానికి రూ.30 కోట్లు, పట్టణ పరిధిలో మూడు వంతెనల నిర్మాణానికి రూ.14 కోట్లు, బహుదా నదిపై వంతెనకు రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ః టమోట రైతులు కష్టాలు, నీరుగట్టు వారిపల్లె చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలపై ప్రస్తావించలేదు. అన్నమయ్య, పింఛ జలాశయాల పునరుద్ధరణ పనుల ఊసేలేదు. ఎక్కువ సమయం  ప్రతిపక్షాలను విమర్శించడానికి కేటాయించారు. కార్యక్రమం అనంతరం టిప్పు సుల్తాన్‌ మైదానం నుంచి కాన్వాయ్‌లో రెడ్డీస్‌ కాలనీ, ప్రశాంత్‌నగర్‌, భాగ్యలక్ష్మీమిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, జిల్లా ఆసుపత్రి, అనిబిసెంట్‌ సర్కిల్‌, సొసైటీకాలనీ గేటు, గాంధీపురం వలయం, బెంగళూరు రోడ్డు మీదుగా బీటీ కళాశాల వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా అక్కడక్కడ రహదారికిరువైపులా ఉన్న జనానికి ప్రత్యేక బస్సులో నుంచి జగన్‌ అభివాదం చేశారు. సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి. మేరుగు నాగార్జున, శానసమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియాఖానం, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, జంగాలపల్లె శ్రీనివాసులు, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డి, మదనపల్లె పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ మనూజారెడ్డి పాల్గొన్నారు.

అడుగడుగునా ఆంక్షలు

సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షల ఛట్రంలో జనం అవస్థలు పడ్డారు. బీటీ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ నుంచి నీరుగట్టువారిపల్లె సమీపంలోని టిప్పుసుల్తాన్‌ మైదానం వరకు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నియంత్రించారు. ప్రధాన రహదారికి అనుగుణంగా ఉన్న అనుసంధాన రహదారులకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. పట్టణంలో నడుచుకుని వెళ్లే వారు మినహా వాహనాల్లో వచ్చే వారిని ముఖ్యమంత్రి వచ్చే దారిలోకి అనుమతించలేదు. అంబులెన్స్‌లకు మినహా మిగిలిన వాహనాలకు అనుమతివ్వకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడ్డారు. హెలీప్యాడ్‌ నుంచి సభాస్థలం వరకు ఉన్న దుకాణాలన్నింటినీ మూసి వేశారు.

పర్యటనలో పదనిసలు

 సీఎం జగన్‌ ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో బీటీ కళాశాల మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణస్వామి, బొత్స సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష, డీఐజీ సెంథిల్‌కుమార్‌, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.  ః సభా స్థలానికి వచ్చిన విద్యార్థులు, ప్రజల వద్ద నుంచి పెన్నులు, ఇతరత్రా వస్తువులను తీసుకుని పోలీసులు తనిఖీ కేంద్రం వద్దనే పడేశారు.* ప్రజలను సభా స్థలంలోకి వదిలే చోట మహిళలను మెటల్‌ డిటెక్టర్‌ ద్వారా తనిఖీ చేసే సిబ్బంది పురుషులు కావడంతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడ్డారు.ః సభా స్థలం సరిపోకపోవడంతో చాలా మంది సమావేశం ప్రారంభమైన కొంత సేపటికే ఎండలో నిలబడలేక వెనుతిరిగి బస్సుల్లోకి వెళ్లిపోయారు * ముఖ్యమంత్రి కార్యక్రమం కనిపించకపోవడంతో చుట్టూ ఏర్పాటు చేసిన వస్త్రాన్ని కొందరు చించేసి లోనికి చొరబడి సమావేశాన్ని వీక్షించారు. సభావేదిక సమీపంలో ప్రైవేటు పాఠశాలల బస్సులను, చంద్రా కాలనీ బైపాస్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సులకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 4 కిలోమీటర్ల దూరం ప్రజలు నడుచుకుని సభా స్థలం వద్దకు రావాల్సి వచ్చింది.* తలసేమియాతో బాధపడుతున్న ఓ బాలిక సభా ప్రాంగణం వద్ద ఉన్న కాన్వాయ్‌ వద్దకు వచ్చి పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసులు 108 వాహనంలోకి తరలించారు.* వీఐపీ గ్యాలరీలోకి పలువురు నాయకులను అనుమతించకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.* సభకు తరలివచ్చిన జనం ఎండధాటికి తట్టుకోలేక తాగునీటి ప్యాకెట్ల కోసం నానా అవస్థలు పడ్డారు. ః సీఎం పర్యటన సందర్భంగా పట్టణ వీధుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందిపడ్డారు.

సన్మానించిన కురబలు.. ముస్లిం మతపెద్దలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సన్మానిస్తున్న ముస్లిం మతపెద్దలు

సీఎం జగన్‌ను కురుబ సంక్షేమ సంఘం, ముస్లిం మైనార్టీ మత పెద్దలు సన్మానించారు. కురబ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు సంఘం నాయకులతో కలిసి సంప్రదాయ కంబళి, ముస్లిం మైనార్టీ మత పెద్దలు తలపై టోపీని పెట్టి, భుజాన రుమాలు వేసి సత్కరించారు. వీరివెంట ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌ షమీం అస్లాం తదితరులున్నారు.

మధ్యలోనే జనం ఇంటిబాట

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే పలువురు సభాస్థలి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లవద్దని కట్టడి చేసినా వినిపించుకోలేదు. సీఎం పర్యటనతో  భద్రత కట్టుదిట్టం చేయడంతో పలువురు సీఎంను చూడకుండగానే వెనుదిరిగారు. ఉదయం 10 గంటల నుంచే సభాస్థలికి జనం చేరుకోగా ఉక్కపోతతో ఉండలేక చాలా మంది సభ నుంచి బయటకొచ్చేశారు. ఎండ ధాటికి కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ చిన్నారి స్పృహతప్పి పడిపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీఐపీ పాసులున్న కొందరిని లోపలికి పంపకపోవడంతో కొందరు వైకాపా కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ పడ్డారు. విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి సభాస్థలికి రాక ముందే వచ్చి ఆయన ప్రసంగం ముగియగానే వెళ్లిపోయారు.  

బాలుడికి రూ.లక్ష ఆర్థిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు మహమ్మద్‌ కుటుంబానికి సీఎం జగన్‌ తక్షణ సాయం కింద రూ.లక్ష మంజూరు చేశారు. మదనపల్లె పట్టణానికి చెందిన ఆటోడైవర్‌ షేక్‌ షావల్లి, హమీదా దంపతులు సీఎం సభావేదిక దిగి వస్తుండగా ఏడాదిన్నర వయసున్న తమ కుమారుడు మహమ్మద్‌ను చూపించడంతో గుర్తించిన ఆయన పిలిపించి విచారించారు. తక్షణ సాయం కింద రూ.లక్ష మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌ గిరీష బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సందప్పతో పంపిణీ చేయించారు. వైద్యసేవలతోపాటు పింఛను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జనం లోపలికి వెళ్లకుండా రోడ్డుపైనే చుట్టుముట్టిన పోలీసులు


బటన్‌ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేస్తున్న సీఎం జగన్‌, పక్కన మంత్రులు బొత్స,
పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యేలు

Read latest Ysr News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని