logo

వైద్య సేవలపై కేంద్ర బృందం సర్వే

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు కేంద్రం బృందం ప్రతినిధి డాక్టరు వై.రమణ పేర్కొన్నారు.

Published : 01 Dec 2022 05:31 IST

కోదండ రామాలయం ఆలయ విశిష్టతను తెలుసుకుంటున్న కేంద్ర బృందం సభ్యులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు కేంద్రం బృందం ప్రతినిధి డాక్టరు వై.రమణ పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని బుధవారం ఆయన మరో సభ్యుడు టి.శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ చారిత్రక వైభవం, ప్రాచీన ప్రాశస్త్యం ప్రత్యేకతలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టరు రమణ మాట్లాడుతూ కేంద్రం ఆదేశాలపై   రెండు జిల్లాల్లోనూ పర్యటించనున్నట్లు తెలిపారు. ‘జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది?, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల ద్వారా రోగులకు ఎలాంటి మేలు జరుగుతోంది.? సాయం సక్రమంగా, సకాలంలో అందుతోందా? లేదా? తదితర వివరాలు  సేకరిస్తాం’ అని వివరించారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటామని, మాతాశిశు మరణాలు ఎక్కడెక్కడ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయనేదానిపై ఆరా తీస్తామని ఆయన తెలిపారు. సిజేరియన్‌ శస్త్రచికిత్సలు ఎందుకు అధికంగా చేస్తున్నారనే వివరాలను సైతం సేకరిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న సేవలు, గుర్తించిన లోపాలు, మెరుగైన వైద్య సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. వీరివెంట ఎన్‌హెచ్‌ఎం జిల్లా డీపీవో నారాయణ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని