logo

రైల్వే ప్రయాణం అంధులకు భారం

శారీరక వైకల్యం కలిగిన వికలాంగులు, మానసిక వికలాంగులు, అంధులు, మూగ-చెవుడు తదితర లోపాలు ఉన్నవారు సుమారు 55 వేల మంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు.

Published : 01 Dec 2022 05:31 IST

వంద శాతం దృష్టి లోపం ఉంటేనే రాయితీ

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : శారీరక వైకల్యం కలిగిన వికలాంగులు, మానసిక వికలాంగులు, అంధులు, మూగ-చెవుడు తదితర లోపాలు ఉన్నవారు సుమారు 55 వేల మంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వీరిలో సుమారు 40 వేల మంది వరకు శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారు ఉండగా... 15 వేల మంది అంధులు, మూగ, చెవుడు లోపం ఉన్నవారున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారికి 40 శాతం అంతకంటే ఎక్కువగా వైకల్యం ఉంటే రైల్వే ఛార్జీలలో 75 శాతం రాయితీ ఇస్తున్నారు. అంధత్వం, మూగ, చెవుడు ఉన్నవారికి వందశాతం వైకల్యం ఉంటే రాయితీలు లభిస్తున్నాయి. మునుపు రైల్వే రాయితీ ఫారంలో వైద్యుల సూచన మేరకు రాయితీలు కల్పించేవారు. తోడుగా వచ్చేవారికి కూడా రాయితీ లభించేది. ప్రస్తుతం పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో అంధులు, మూగ, చెవుడు లోపం ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఇందిరమ్మ. కుమారుడి పేరు సుమన్‌. సొంతూరు కడప నగరం శంకరాపురం. అతనికి 75 శాతం అంధత్వం ఉంది. సదరం ధ్రువపత్రం ఉంది. అంధత్వ, ఇతర వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌, చెన్నై, మదురై తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. నాలుగైదేళ్ల వరకు రైల్వే ఛార్జీలలో రాయితీ లభించేది. ప్రస్తుతం 100 శాతం అంధత్వం ఉంటేనే రాయితీ ఇస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో వేలాది మంది ఉన్నారు. కంటి పరీక్షల కోసం తరచూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. రైల్వే రాయితీ ఇస్తే పేదలకు కాస్త అండగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.


వైద్య ఖర్చులకు ఇబ్బంది

40 శాతం ఆపై వైకల్యం ఉన్న దివ్యాంగులకు రైల్వే ఛార్జీల్లో 75 శాతం రాయితీ ఇస్తున్నారు. అంధులకు, మూగ, చెవుడు బాధితుల్లో 50 శాతం లోపం ఉన్న వారికి కూడా రైల్వే ఛార్జీలలో రాయితీని కల్పించాలి. వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతుంటారు. రైల్వే బోర్డు వారి మానవతా దృక్పథంతో ఆలోచించి రాయితీలు కల్పించాలి.

 చిన్నసుబ్బయ్య యాదవ్‌, కడప


వైకల్య శాతం మేరకే రాయితీలు

అంధులు, మూగ-చెవుడు ఉన్న వారికి వందశాతం వైకల్యం ఉంటేనే రైల్వే రాయితీ లభిస్తుంది. సదరం ధ్రువపత్రం కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. గతంలో వైద్యుల సూచన మేరకు రైల్వే రాయితీ ఫారంలో బాధితుడికి రాయితీలు ఇచ్చేవారు. ప్రస్తుతం సదరం ధ్రువపత్రంలో వైద్యులు నిర్ధారించిన వైకల్యం శాతం మేరకు రాయితీలు ఇస్తున్నాం. శారీరక, మానసిక లోపం ఉన్నవారికి 40 శాతం వైకల్యం ఉన్నా రాయితీ ఇస్తున్నారు.

 యానాదయ్య, కడప రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని