logo

ముఖ్యమంత్రి హామీ... ఏడాదైనా నెరవేరదేమీ?

‘‘భారీ వర్షాలతో వరదొచ్చింది. ఊహించని స్థాయిలో ప్రవాహం పెరిగింది. అన్నమయ్య జలాశయం నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపవచ్చు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దఎత్తున నీరు చేరడంతో 3.20 క్యూసెక్కులు చేరింది.

Published : 02 Dec 2022 04:21 IST

వరదలకు  కొట్టుకుపోయిన కరకట్టలు
నేటికీ  పూర్తవ్వని  తాత్కాలిక  పనులు
అధికార పార్టీలో వర్గాలతో జాప్యం
నిధుల్లేక నిలిచిన రక్షణగోడ నిర్మాణం
న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, రాజంపేట గ్రామీణ, పెనగలూరు

రామచంద్రాపురం - రాచపల్లె మధ్య చెయ్యేరు నదిలో దెబ్బతిన్న కరకట్ట

‘‘భారీ వర్షాలతో వరదొచ్చింది. ఊహించని స్థాయిలో ప్రవాహం పెరిగింది. అన్నమయ్య జలాశయం నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపవచ్చు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దఎత్తున నీరు చేరడంతో 3.20 క్యూసెక్కులు చేరింది. పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. ఆయా జలాశయాలను రీ డిజైన్‌ చేయిస్తాం. భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ వరదొచ్చినా ఎలాంటి నష్టం జరగకుండా ఆకృతులు మార్పు చేసి నిర్మిస్తాం. చెయ్యేరు నదీ పరివాహకంలో ఎక్కడైతే గ్రామాలు, ఆవాసాలున్నాయో అక్కడ రానున్న రోజుల్లో వరద నీరు చొరబడకుండా నందలూరు వంతెన వరకు రక్షణ గోడను కట్టే కార్యక్రమాన్ని చేపడతాం. ’’

- 2021, డిసెంబరు 2న రాజంపేట మండలం పులపుత్తూరు వరద ప్రభావిత గ్రామంలో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చేసిన వాగ్ధానమిది.


ఉమ్మడి కడప జిల్లాలో గతేడాది నవంబరు 19వ తేదీన రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద నిర్మించిన అన్నమయ్య జలాశయంలోకి భారీగా వరదొచ్చింది. చెయ్యేరు నది పోటెత్తి ఉగ్రరూపం దాల్చడంతో జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. వరద వెల్లువలా దిగువ ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి, పశునష్టం జరిగింది. గతంలో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో చెయ్యేరు నదీ పరివాహక గ్రామాలకు రక్షణగా కుడివైపున 38 కిలోమీటర్లు, ఎడమ వైపున 41 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన కరకట్టలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.

నామినేషన్‌ పద్ధతిలో అప్పగింత

ఈ ఏడాది జనవరి మొదటి వారంలో 20 తాత్కాలిక పనులను మంజూరు చేశారు. వీటి అంచనా విలువ రూ.3 కోట్లు. జలవనరుల శాఖ పర్యవేక్షణలో పనులకు అనుమతిచ్చారు. అనంతరం మరికొన్నింటికి పచ్చజెండా ఊపారు. గుత్తపత్రాలను ఆహ్వానించలేదు. అత్యవసరంగా చేపట్టాలని నామినేషన్‌ పద్ధతిలో అధికార పార్టీలోని కీలక నేతలు సిఫార్సు చేసిన వారికి కట్టబెట్టారు. ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న మట్టి, ఇసుకతో 10 అడుగుల ఎత్తు, 12-15 అడుగుల మేర వెడల్పు చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కో పని విలువ రూ.5 లక్షలు దాటితే గుత్తపత్రాలను ఆహ్వానించి గుత్తేదారులకివ్వాలనే నిబంధనను వరదలో కలిపేశారు. ప్రతి గ్రామంలో అధికార పార్టీలో రెండు వర్గాలుండగా, ఒక వర్గానికి పనులు దక్కితే.. మరో వర్గం పనుల్లో నాణ్యత లేదని, నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని అధికారులకు ఫిర్యాదులు చేయడం సాంకేతిక నిపుణులకు తలనొప్పిగా మారింది. స్థానిక, డివిజన్‌ అధికారుల చెంత పంచాయతీ జరిగినా మార్పు రాలేదని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తాత్కాలిక కరకట్ట పనులు వివాదస్పదం కావడంతో చేసేదేమిలేక కొన్నిచోట్ల మధ్యలోనే నిలిపివేశారు. మరికొన్ని పూర్తిచేసినా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

రాజంపేట మండలం తొగురుపేట శివారులో నిలిచిన తాత్కాలిక మట్టికట్ట నిర్మాణం

ప్రతిపాదనలతో సరి

సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు (2021 డిసెంబరు 2న) ముఖ్యమంత్రి జగన్‌ నది చెంతనే ఉన్న గ్రామాల నుంచి నందలూరు వంతెన వరకు రక్షణ గోడను నిర్మిస్తామని ప్రకటించారు. సిమెంటు కాంక్రీటుతో చేపట్టాలంటే రూ.250 కోట్లకు పైగా నిధులు అవసరమని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెరిగిన ధరలతో అంచనా వ్యయం మరింత పెరగనుంది. ఇంత పెద్దఎత్తున ఆర్థిక పద్దు నిధుల్లేవని పక్కన పెట్టేశారు. స్వయంగా ముఖ్యమంత్రి వాగ్దానం చేసినా ఇప్పటికీ నెరవేరలేదు. కనీసం ప్రతిపాదనల దశ దాటలేదు.


వాగ్దానం నీటి మీద రాతలే
- కోట పట్టాభిరామయ్య, తొగురుపేట

గతేడాది చెయ్యేరు వరదలకు కరకట్టలు నామరూపల్లేకుండా కొట్టుకుపోయాయి. నది సమీప గ్రామాల్లోకి భవిష్యత్తులో వరద రాకుండా రక్షణగోడ నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చి ఏడాదైనా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.


ఎలాంటి కదలిక లేదు
మునగాల నాగేశ్వరయ్య, ఎగువమందపల్లి

చెయ్యేరు నది నుంచి ఊర్లోకి వరద రాకుండా గతంలో నిర్మించిన కరకట్టలు గతేడాది వరదలకు కొట్టుకుపోయాయి. ఇంతవరకు తాత్కాలిక పనులు పూర్తిచేయలేదు. ఇక్కడి పనుల్లో ఎలాంటి కదలిక లేదు. మళ్లీ వరదలొస్తే మా పరిస్థితేంటి.?


శాశ్వత నిర్మాణంపై దృష్టి సారిస్తాం
- శ్రీనివాసులు, ఎస్‌ఈ, జలవనరులశాఖ

గతేడాది వరదలకు దెబ్బతిన్న కరకట్టలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. శాశ్వత రక్షణగోడ నిర్మాణంపై దృష్టి సారిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని