logo

దరఖాస్తుకు రూ.వెయ్యి.. ఓటుకు రూ.10 వేలు!

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మూతపడిన విద్యాసంస్థల నుంచి దరఖాస్తుల రావడమే కాకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ చోటుచేసుకుంటున్నాయి.

Updated : 07 Dec 2022 14:07 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాయిలాలు
మూసేసిన విద్యాసంస్థల నుంచి ఓట్ల నమోదు
వెలుగు చూస్తున్న బోగస్‌ వ్యవహారాలు
ఈనాడు డిజిటల్‌, కడప

* అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి విజయవాడలో ఏపీఎండీసీలో పొరుగుసేవల కింద పనిచేస్తుండగా, స్థానికంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈయన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సోదరుడు కావడం విశేషం. రైల్వేకోడూరు పట్టణంలోని ఓ విద్యాసంస్థలో యుడైఎస్‌ వివరాల ప్రకారం 12 మందికి అర్హత ఉండగా 18 మందిని నమోదు చేశారు.


* వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేశారు. యుడైస్‌లో (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌) మూసివేత జాబితాలో ఉన్నట్లు చూపిస్తోంది. ఓటర్ల జాబితాలో పాఠశాల పేరు ఉండడం గమనార్హం. ఇక్కడే మరో పాఠశాలలో విద్యార్థులు అదృశ్యం కావడంతో 2010లోనే గుర్తింపును రద్దు చేశారు. పాఠశాల పేరు మార్చుకుని అయిదుగురిని ఓటర్లుగా చేర్చారు.  ప్రొద్దుటూరులోనే ఇద్దరు ఉపాధ్యాయినులు పనిచేస్తున్న పాఠశాల నుంచి కాకుండా వేరే విద్యాసంస్థ నుంచి ఓటర్లుగా నమోదయ్యారు. తాయిలాలిస్తున్న కారణంగా పోటీలు పడి నమోదు చేస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


* పులివెందుల నియోజకవర్గంలోనూ బోగస్‌ ఓట్లు నమోదయ్యాయి. రెడ్డివారిపల్లెలో ఓ ప్రైవేటు పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు పని చేయకున్నా చేస్తున్నట్లు చూపి ఓటరుగా నమోదయ్యారు.


పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మూతపడిన విద్యాసంస్థల నుంచి దరఖాస్తుల రావడమే కాకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1,000 చెల్లించగా, ఓటుకు రూ.10 వేలు ఇస్తామనే హామీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ రకంగా ఎన్నడూ లేనంతగా గురువుల ప్రతిష్ఠకు భంగం కలిగేవిధంగా చోటుచేసుకున్న పరిణామాలపై అటు అన్నమయ్య... ఇటు వైయస్‌ఆర్‌ జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

బోగస్‌ ఓట్లపై కలెక్టర్‌ విజయరామరాజుకు ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు రాష్ట్ర  అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం  

పరిశీలించకుండానే...!

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుడు మూడేళ్లపాటు వరుసగా నెలవారీగా జీతాలు పొందినట్లు దస్త్రాలు, బ్యాంకు ఖాతాల ఆధారాలు పరిశీలించడం, పీఎఫ్‌ వివరాలు, హాజరు దస్త్రాలను పరిశీలించి డీఈవో/ ఎంఈవో సంతకం చేయాలి. వీటన్నింటినీ మరోసారి బీఎల్‌వోలు పరిశీలించిన అనంతరం ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఇవన్నీ పరిశీలించకుండానే ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్‌ఆర్‌ డీఈవో సంతకం, సీలుపై అనుమానాలు తలెత్తగా... నివృత్తి చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలు ఉపాధ్యాయ సంఘాలు గుప్పిస్తున్నాయి. వేలాదిగా బోగస్‌ ఓట్లు ఉన్నట్లుగా ఆధారాలతో సహా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇతర జిల్లాలతో పోల్చితే వైయస్‌ఆర్‌లోనే ఎక్కువగా బోగస్‌ ఓట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.


అర్హుల తొలగింపు...

ఓ వైపు బోగస్‌ ఓట్లపై దృష్టిసారించి అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న ఉపాధ్యాయులకు మరోవైపు చుక్కెదురవుతోంది. అర్హత ఉన్న ఓట్లను చాలా వరకు తొలగించినట్లు చెబుతున్నారు. చెన్నూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గంపగుత్తగా ఓట్లన్నీ తొలగించారని విమర్శిస్తున్నారు. రెండు జిల్లాల్లోనూ చాలా వరకు ఓట్లను తొలగించగా, వీటిని తిరిగి చేర్పించుకోవడానికి కుస్తీ పడుతున్నారు.  

 


పరిశీలన చేయిస్తున్నాం
-రాఘవరెడ్డి, డీఈవో, అన్నమయ్య జిల్లా

దరఖాస్తులు... ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నాం. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు తనిఖీ చేస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు ఆధారాలుంటే వెంటనే తొలగిస్తున్నాం.


ఫిర్యాదులు అందితే చర్యలు
-దేవరాజు, డీఈవో, వైయస్‌ఆర్‌ జిల్లా

బోగస్‌ ఓట్లపై నాకెలాంటి ఫిర్యాదులు రాలేదు. నా సంతకం, సీలుపై అనుమానాలున్నట్లు ఎవరూ తెలుపలేదు. అంతా సవ్యంగానే జరుగుతోంది.  


కొనుగోలుకు జోరుగా ఎత్తుగడలు
-కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌

కొందరు బోగస్‌ ఓట్లు నమోదు చేయించి అక్రమాలకు తెరలేపారు. ఓటరుగా దరఖాస్తు చేయిస్తే రూ.1000 ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలిచ్చి కొనుగోలు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టి ఉపాధ్యాయ వర్గానికి తోడుగా ఉండేవారిని గెలిపించుకుంటాం. ఎన్నడూలేనంతగా అక్రమాలు చూస్తున్నాం. వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.      

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని