logo

కొండను మింగిన అనకొండ!

పచ్చటి కొండపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను పడింది. ప్రజాసేవ పేరిట జనాలను నమ్మించేందుకు ఎత్తుగడ వేశారు.

Published : 08 Dec 2022 02:28 IST

సచివాలయ భవన నిర్మాణం పేరిట ఎత్తుగడ
చెరువు   అంచు పూడ్చేసి తన ఇంటికి రహదారి
రాజంపేటకు చెందిన ఓ నేత అక్రమాల పర్వం

కొండ ప్రాంతం వద్ద సచివాలయ భవన నిర్మాణం

పచ్చటి కొండపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను పడింది. ప్రజాసేవ పేరిట జనాలను నమ్మించేందుకు ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ భవనాలను ఊరికి దూరంగా తరలించుకునిపోయి కొండ ప్రాంతంలో నిర్మించే ప్రయత్నం చేశారు. చదును పేరిట తనకు కావాల్సిన ప్రభుత్వ భూమిని కాజేశారు. తన ఇంటికి రహదారి నిర్మించుకునే క్రమంలో చెరువును కొంత పూడ్చేశారు. పునరావాసం కల్పన పేరిట వందలాది మందికి ఇళ్ల స్థలాలంటూ అధిక విస్తీర్ణంలో కొండ తవ్వేసి చదును చేసి అందంగా తీర్చిదిద్దారు. వాటిని పేదలకిస్తే ఫరవాలేదు ఈ ముసుగులో ఏదో జరగబోతోందంటూ మాత్రం స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, కడప

రాజంపేట పట్టణానికి అత్యంత సమీపంలో పోలి పేరిట గ్రామం ఉంది. పట్టణ సమీపంలోని గ్రామం కావడంతో ఇక్కడ భూములకు అత్యంత గిరాకీ ఉంది. అధికార పార్టీకి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి 831/1ఎ సర్వే నంబరుతో ఉన్న ప్రభుత్వ భూమిగా చూపిస్తున్న కొండపై కన్నేశారు. సుమారు 1,176 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. వందలాది ఇళ్లు ఉన్న పోలి గ్రామంలో ప్రభుత్వ భూములుండగా, గ్రామానికి దూరంగా గ్రామ సచివాలయం.. రైతు భరోసా కేంద్రం  తరలించుకుపోయి కొండ ప్రాంతంలో నిర్మించారు. తనకు కావాల్సినంత ప్రభుత్వ భవనాలను ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని చదును చేసుకుని సిద్ధం చేసుకున్నారు. అటు పక్కే తన ఇల్లు ఉండడంతో పోలి గ్రామం మీదుగా ఉన్న తారురోడ్డు కాదని, సమీపంలోని చెరువు అంచును పూడ్చుకుంటూ శనేశ్వరస్వామి ఆలయం నుంచి వెడల్పయిన బైపాస్‌ రహదారినే నిర్మించేశారు. నందలూరు మండలంలోని సోమశిల వెనుకజలాల ముంపు బాధితులకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వ భవనాలకు ముందు భాగంలో కనుచూపు మేర కనిపించే కొండ ప్రాంతాన్ని చదును చేసి అందంగా తీర్చిదిద్దారు. రహదారులు, విద్యుత్తు కనెక్షన్లు సిద్ధం చేశారు. జగనన్న కాలనీల్లో కూడా లేనన్ని మౌలిక వసతులు కల్పించి ఎక్కడా లేనంతగా ఒక్కొక్కరికి అయిదు సెంట్ల  వంతున కేటాయింపునకు సిద్ధం చేశారు. పేదలకిస్తే ఫరవాలేదు వారి పేరిట ఏమైనా జరుగుతుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సచివాలయ భవనానికి తూర్పున చదును చేసిన కొండ ప్రాంతం

*  నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం తూర్పు భాగంలో కొండ ప్రాంతాన్ని చదును చేసిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన పేరిట స్థలాలను సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పోలి గ్రామానికి అనువుగానిచోట నిర్మాణాలు తలపెట్టి భావితరాలకు కొండ కనిపించకుండా క్రమంగా తవ్వేస్తున్నారు. సహజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతకు బడా నేతల అండదండలుండడంతో ఈ వ్యవహారం జరుగుతోందనే స్థానికంగా బలంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

చెరువును పూడ్చేసి  నిర్మించిన రహదారి

* పోలి గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీగా కొండ తవ్వకాలు జరుగుతున్నాయని రెవెన్యూశాఖలో చర్చలు జరుగుతున్నాయి. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్నా ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు పాటించకుండా కొండ తవ్వకాలు.. రహదారుల నిర్మాణాలు జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించడం గమనార్హం. ప్రభుత్వ భవనాలకు అవసరానికి మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు వీటిపై చర్యలు తీసుకునే నిమిత్తం ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. అధికార పార్టీ నేతల కబ్జాలు అడ్డుకోలేక.. ప్రభుత్వ భూమిని వదులుకోలేక రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ పోలి గ్రామ సమీపంలో కొండ తవ్వకాలపై వెంటనే విచారణ జరుపుతామన్నారు. ప్రజావసరాల కోసమైతే తప్పనిసరిగా రెవెన్యూపరమైన అనుమతులు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని